యువత మధ్యతరగతికి AI సునామీతో భారీ రిస్క్.. జాబ్స్ దొరుకుడు కష్టమే: IMF డైరెక్టర్

యువత మధ్యతరగతికి AI సునామీతో భారీ రిస్క్.. జాబ్స్ దొరుకుడు కష్టమే: IMF డైరెక్టర్

అంతరిక్షంలోకి రాకెట్లు పంపడం నుంచి జేబులోని స్మార్ట్‌ఫోన్ వరకు ఏఐ దూసుకుపోతోంది. అయితే ఈ టెక్నాలజీ కేవలం సౌకర్యాలను మాత్రమే కాదు.. ప్రపంచ జాబ్ మార్కెట్‌ను అతలాకుతలం చేసే సునామీని కూడా వెంటబెట్టుకొస్తోందని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా సంచలన విషయం బయటపెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

రాబోయే కొన్నేళ్లలో ఏఐ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితం కానున్నారని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా.. అంటే దాదాపు 60 శాతంగా ఉండబోతోందట. కొన్ని ఉద్యోగాలు ఏఐ వల్ల మెరుగుపడితే, మరికొన్ని పూర్తిగా కనుమరుగయ్యే లేదా రూపాంతరం చెందే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

యువతకు, మధ్యతరగతికి బ్యాడ్ టైమ్..?
ఈ ఏఐ తుపానులో యువత, మధ్యతరగతి ప్రజలే ప్రధాన బాధితులుగా మారనున్నారని జార్జివా ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా యువత తమ కెరీర్ ప్రారంభంలో చేసే ఎంట్రీ లెవల్ పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. దీనివల్ల కొత్తగా ఉద్యోగాల కోసం వెతికే యువతకు సరైన అవకాశాలు దొరకడం కష్టతరంగా మారుతుందని చెప్పారు. ఇక మధ్యతరగతి విషయానికి వస్తే.. ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకున్న వారికి మాత్రమే ఉత్పాదకత పెరుగుతుంది. మిగిలిన వారికి శాలరీలు తగ్గిపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడికి లోనవుతారని ఆమె తేల్చి చెప్పేశారు.

Also Raed ;  కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్..

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేగంతో పోలిస్తే.. దానిని నియంత్రించే చట్టాలు చాలా నెమ్మదిగా ఉన్నాయని జార్జివా పేర్కొన్నారు. ఏఐని సురక్షితంగా అందరికీ అందుబాటులో ఉండేలా ఎలా మార్చాలో మనకు ఇంకా పూర్తిస్థాయిలో తెలియదని, దీనివల్ల సమాజంలో అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని కుండబద్ధలు కొట్టినట్లు నిజాలు బయటపెట్టారు జార్జివా.

ఈ చర్చలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా పాల్గొని.. ఏఐ వల్ల కలిగే లాభాలు కేవలం కొన్ని కంపెనీలకే పరిమితమైతే, ఈ టెక్నాలజీపై ప్రజల్లో ఉన్న సానుకూల అభిప్రాయం దెబ్బతింటుందని హెచ్చరించారు. అలాగే కార్మిక సంఘాలు కూడా ఏఐ వల్ల వచ్చే లాభాలను కార్మికులతో పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంమీద ఏఐ అనేది ఒకవైపు ప్రొడక్టివిటీ పెంచుతున్నప్పటికీ, సరైన నిర్వహణ లేకపోతే అది ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు దారితీసే ప్రమాదం ఉందని దావోస్ సదస్సులోని నిపుణులు ముందుగానే కళ్లు తెరవాలంటూ హెచ్చరిస్తున్నారు.