ఇవాళ్టి నుంచి మిస్ వరల్డ్ పోటీలు..గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ

ఇవాళ్టి నుంచి మిస్ వరల్డ్ పోటీలు..గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ
  •  
  • హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ..హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి
  • పాల్గొననున్న వెయ్యి మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు 
  • పోటీల్లో పాల్గొంటున్న 120 దేశాల కంటెస్టెంట్స్.. ఇప్పటికే 109 దేశాల నుంచి రాక  
  • స్టేడియం, కంటెస్టెంట్లు బస చేస్తున్న హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ వేదికగా ‘మిస్​ వరల్డ్–2025’ వేడుకలకు వేళైంది. ‘తెలంగాణ జరూర్​ ఆనా’ ట్యాగ్​లైన్​తో జరుగుతున్న ఈ పోటీలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్​గచ్చిబౌలి ఇండోర్​ స్టేడియంలో శనివారం సాయంత్రం 6 గంటలకు మిస్​వరల్డ్​ ఓపెనింగ్​ సెర్మనీ అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి హాజరుకానున్నారు. ఈ పోటీల్లో మన దేశం తరఫున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంగా.. ప్రముఖ సినీ నటుడు సోనూసూద్​ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు.   ఓపెనింగ్ సెర్మనీకి వెయ్యి మందికి పైగా దేశ, విదేశీ అతిథులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతారని అధికారులు చెబుతున్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్​నడుమ తలెత్తిన పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌లో  సెక్యూరిటీ టైట్​ చేశారు. ప్రారంభ వేడుకలు జరగనున్న స్టేడియం వద్ద , కంటెస్టెంట్లు స్టే చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

23 రోజుల పాటు వేడుకలు.. 

శనివారం నుంచి మొదలయ్యే​మిస్​వరల్డ్ పోటీలు జూన్​2న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ముగుస్తాయి. మొత్తం 23 రోజుల పాటు సాగే పోటీల్లో కీలకమైన గ్రాండ్​ ఫినాలె ఈ నెల 31న హైటెక్స్​లో జరగనుంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను, హెల్త్​టూరిజాన్ని ప్రమోట్​చేయడం ద్వారా  ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణకు ముందుకొచ్చింది. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్​పాల్గొంటారనే అంచనా ఉండగా, శుక్రవారం వరకు 109 దేశాల నుంచి అందాల భామలు నగరానికి తరలి వచ్చారు. శంషాబాద్ ఎయిర్​పోర్టులో వీరికి  రాష్ట్ర అధికారులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. హైటెక్​ సిటీలోని ట్రైడెంట్​హోటల్‌‌‌‌లో కంటెస్టెంట్లకు వసతి సౌకర్యం కల్పించారు. వాళ్లందరినీ శనివారం నాలుగు ప్రత్యేక బస్సుల్లో గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. 

రాష్ట్ర గీతంతో ప్రారంభం.. 

మిస్​వరల్డ్​వేడుకలు రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆలాపనతో ప్రారంభమవుతాయి. ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం ఆలపిస్తారు. తర్వాత  తెలంగాణ శాస్త్రీయ నృత్యరీతిగా ఖ్యాతి గడించిన పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి నృత్యం  ప్రదర్శిస్తారు. దీనికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత నిపుణుడు ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు. దాదాపు పది నిమిషాల పాటు జరిగే ఈ పేరిణి నాట్యంలో సౌందర్యం, సంస్కృతి, స్త్రీల సాధికారత అంశాలు ప్రధానంగా ఉదహరించనున్నారు.

తొలిరోజు కంటెస్టెంట్ల​ పరిచయం.. 

పోటీల్లో భాగంగా తొలిరోజు కంటెస్టెంట్స్​ పరిచయ కార్యక్రమం ఉంటుంది. వారు ఏ దేశం నుంచి వచ్చారు? వారి పేరు, నేపథ్యం తదితర వివరాలను వెల్లడించనున్నారు. గతంలో మిస్​వర్డల్​ పోటీల్లో పాల్గొన్నారా? ఇదే తొలిసారా? అనే వివరాలు వెల్లడిస్తారు. అనంతరం తెలంగాణ జానపద, గిరిజన కళారూపాలను ప్రదర్శించనున్నారు. రామకృష్ణ బృందంతో కొమ్ము కోయ కళా ప్రదర్శన,  కత్లే శ్రీధర్ బృందంతో గుస్సాడీ కళా ప్రదర్శన ఉంటాయి. అందే భాస్కర్ బృందంతో  డప్పు వాయిద్యంతో పాటు బంజారా మహిళల విన్యాసాలు, స్వప్న బృందం ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు చౌదరపల్లి రవి కుమార్ బృందం ప్రదర్శిస్తుంది. 

భారత్‌‌‌‌కు నందినిగుప్తా ప్రాతినిధ్యం.. 

మన దేశం తరఫున రాజస్థాన్‌‌‌‌లోని కోటాకు చెందిన నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆమె పదేండ్ల వయస్సు నుంచే మిస్ ఇండియా కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 19 ఏండ్ల వయసులో 2023లో మిస్ రాజస్థాన్ టైటిల్ గెలు చుకున్నారు. అదే సంవత్సరం మణిపూర్‌‌‌‌లోని ఇంఫాల్‌‌‌‌లో జరిగిన 59వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్‌‌‌‌ గెలు చుకున్నారు. ఇప్పుడు మిస్​వరల్డ్​ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వేదికపై ఆమె తన సామాజిక కార్యక్రమం ప్రాజెక్ట్ ఏక్తాను ప్రదర్శించనున్నారు. భారత్‌‌‌‌కు ఏడో మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించాలన్న లక్ష్యంతో నందినిగుప్తా ముందుకెళ్తున్నారు. 

పోటీలకు పాక్‌‌‌‌ కంటెస్టెంట్ ​దూరం  

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌‌‌‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పాకిస్తానీయులంతా భారత్ విడిచివెళ్లాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలకు పాకిస్తాన్​ కంటెస్టెంట్​గైర్హాజరైనట్లు తెలిసింది.