బాలిక మృతి ఘటనపై దమ్మాయిగూడలో ఉద్రిక్తత

బాలిక మృతి ఘటనపై దమ్మాయిగూడలో ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా చెరువు వద్దకు వెళ్లగా చిన్నారి శవం నీటిపై తేలుతూ కనిపించింది. వెంటనే చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. డెడ్ బాడీని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు అంబులెన్సులో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దమ్మాయిగూడలో ఉద్రిక్తత

దమ్మాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ నగర్ కు బాలిక డెడ్ బాడీ తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అంబులెన్స్ ను అడ్డుకున్న స్థానికులు.. అంబేద్కర్ నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో చెప్పడంతో పాటు ఘటన ఎలా జరిగిందో క్లియర్ గా చెప్పేంతవరకు అంబులెన్సును కదలనివ్వమని రోడ్డుపై బైఠాయించారు. బాలిక కుటుంబానికి న్యాయం చేసేవరకు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయితే పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను డైవర్ట్ చేసి మరో మార్గంలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పోలీసు వాహనంపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు.

ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే బాలిక మృతి

దమ్మాయిగూడ బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం ముగిసింది.  డాక్టర్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం బాలిక శరీరంపై ఎటువంటి  గాయాలు లేవని తేల్చారు. చిన్నారి ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు గుర్తించారు. చెరువులో పడి నీరు మింగడం వల్లే బాలిక చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బాలికను ఎవరైనా చెరువులో తోసేశారా..?.. లేక తనే ఆడుకుంటూ చెరువులో పడిందా అనేది తేలాల్సి ఉంది. నిబంధనల మేరకు గాంధీ హాస్పిటల్ డాక్టర్ల బృందం పంచనామా, పోస్ట్ మార్టం పూర్తి చేసింది. నాలుగు పేజీలు..22 కాలమ్స్ లో పంచనామా వివరాలు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు బాలిక డెడ్ బాడీని పోలీసులు అప్పగించారు. 

బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం ముగిసింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి పంపారు. అయితే అంబులెన్సును చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఏం జరిగిందో చెప్పడంతో పాటు బాలిక కుటుంబానికి న్యాయం చేసేంత వరకు అంబులెన్స్ ను కదలనిచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు.

బాలిక మృతదేహానికి పంచనామా

దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన బాలిక మృతదేహానికి  గాంధీ ఆస్పత్రిలో పంచనామా నిర్వహిస్తున్నారు. పంచనామా వివరాలను మొత్తం 4 పేజీల్లో వైద్యులు నమోదు చేస్తున్నారు. 4 పేజీల్లోని 22 కాలమ్స్ లో వివరాలను ప్రస్తావిస్తున్నారు. అనుమానాస్పద మరణంపై పంచనామా ప్రాసెస్ కు గంట సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముగ్గురు వైద్యుల బృందంతో పంచనామా పూర్తి చేయాలన్న నిబంధనను అనుసరిస్తున్నారు. 

మార్చురీ వద్ద ఉద్రిక్తత..

బాలిక మృతి నేపథ్యంలో గాంధీ మార్చురీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.  తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆందోళన నిర్వహించారు. బాలిక మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న మరికొంతమంది మహిళా కార్యకర్తలను అరెస్టు చేశారు.

ఎఫ్ఐఆర్లో ఏముందంటే..

గురువారం ఉదయం 9 : 20 గంటల సమయంలో బాలికను తండ్రి స్కూల్ వద్ద డ్రాప్ చేశాడు. అనంతరం చిన్నారి పార్కుకు వెళ్దామని స్నేహితులతో చెప్పగా వారు నిరాకరించారు. దీంతో చిన్నారి క్లాస్ రూంలోనే బ్యాగు పెట్టి స్కూల్ నుంచి బయటకు వచ్చింది. ఉదయం 10.20 గంటలకు టీచర్ అటెండెన్స్ తీసుకోగా.. బాలిక మిస్సైనట్లు గుర్తించారు. బ్యాగు క్లాస్ రూంలోనే ఉండటంతో టీచర్లు స్కూల్ పరిసరాల్లో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు

బాలిక మిస్సైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న జవహర్ నగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. స్కూల్ నుంచి బాలిక వెళ్లిన రూట్ లో సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలిక చదువుతున్న పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువు కిలోమీటర్ దూరంలో ఉంది. చిన్నారి చెరువు వైపు ఎందుకు వెళ్లిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బాలిక మృతిపై అనుమానాలు

స్కూలు నుంచి బయలు దేరిన బాలిక అసలు చెరువు వద్దకు ఎందుకు వెళ్లిందన్నది మిస్టరీగా మారింది. బాలిక శరీరంపై కత్తి గాయాలుండటంతో కుటుంబసభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు సాయంత్రం వరకు మిస్సింగ్ కేసు నమోదుచేయలేదని అంటున్నారు. కంప్లైంట్ అందిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టుంటే చిన్నారి ఆచూకీ దొరికేదని తల్లిదండ్రులు అంటున్నారు.

చెరువు వద్ద అసాంఘిక కార్యకలాపాలు

బాలిక మిస్సైన సమయంలో చెరువు వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి తాగుతూ కనిపించారని బంధువులు చెబుతున్నారు. దానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దమ్మాయిగూడ చెరువు ప్రాంతం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి తాగడం నిత్యకృత్యంగా మారిందని అంటున్నారు. జవహర్ నగర్ పీఎస్లో ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.