సైఫాబాద్, వెలుగు: హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని షీ టీమ్స్‌లో పనిచేస్తూ ఈ నెల 2న అదృశ్యమైన హెడ్ కానిస్టేబుల్ సురేశ్ ఆచూకీ లభ్యమైంది. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ గన్ మెన్ వేధింపుల వల్లే తన భర్త కనిపించకుండా పోయాడన్న భార్య రూప ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ఫోన్ ఆన్ చేయడంతో సిగ్నల్స్ ఆధారంగా కూకట్‌పల్లిలోని తన స్నేహితుడు రామకృష్ణ ఇంట్లో సురేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వెంటనే అక్కడికి చేరుకుని సురేశ్ ను సురక్షితంగా ఇంటికి చేర్చారు. కాగా, గన్ మ్యాన్ వేధింపుల వ్యవహారంపై సీపీ సజ్జనార్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సదరు గన్ మ్యాన్ పై వేటు వేశారు. అతనికి మెమో జారీ చేయడంతో పాటు, తక్షణమే హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో వేధింపులు నిజమని తేలితే గన్ మ్యాన్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
