ఇంటింటికి నల్లాలన్నరు.. ఇప్పుడేమో హ్యాండ్ బోరింగులేస్తున్నరు

ఇంటింటికి నల్లాలన్నరు.. ఇప్పుడేమో హ్యాండ్ బోరింగులేస్తున్నరు
  •     ట్యాంకులు పూర్తయినా వాటర్​ ఇయ్యట్లే 

  •     పెద్దపల్లి టౌన్‌‌‌‌లో ఏండ్ల తరబడి సాగుతున్న పనులు

  •     భగీరథపై ఆశలు వదిలేసుకుంటున్న జనం
     

పెద్దపల్లి, వెలుగు: మిషన్​భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పెద్దపల్లి టౌన్‌‌‌‌లో భగీరథ ట్యాంకులు, ఇంటర్నల్​పైప్‌‌‌‌లైన్​ పనులు పూర్తయినా ఇంకా ట్రయల్స్​దశలోనే ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు పెద్దపల్లి పట్టణంలో మంచినీటి సమస్య తీర్చడానికి స్వచ్ఛంద సంఘాల సహాయంతో బోరింగులు వేయిస్తున్నారు. ఇన్నాళ్లు భగీరథ వస్తుంది.. హ్యాండ్​బోరింగ్‌‌‌‌లు అవసరం లేదని చెప్పిన సర్కార్‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడేమో మళ్లీ బోరింగ్‌‌‌‌లు వేయిస్తోంది.ఏండ్ల తరబడి భగీరథ పనులు నడుస్తుండడంతో జనం ఆ నీటిపై ఆశలు వదిలేసుకుంటున్నారు. 

ఏండ్ల సంది సాగుతున్న పనులు


ప్రభుత్వం 2016లో మిషన్ భగీరథ కింద పెద్దపల్లి పట్టణానికి రూ.34 కోట్లు కేటాయించింది.  పట్టణంలో 118 కి.మీ పైప్ లైన్ తోపాటు, పెద్దపల్లి టౌన్‌‌‌‌కు పూర్తి స్థాయిలో నీరందించేలా1200 కెఎల్, 2100 కెఎల్ కెపాసిటీతో రెండు ట్యాంకుల నిర్మాణం ప్రారంభించారు. వీటి నిర్మాణానికి రూ.1.78 కోట్లు, రూ.2.50 కోట్లు కేటాయించారు. ఈ ట్యాంకుల నిర్మాణం ఇటీవల పూర్తయింది. కానీ ట్యాంకులు ట్రయల్​లోనే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎండాకాలం పూర్తి కావస్తున్నా భగీరథ నీరు పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరోవైపు మున్సిపాలిటీ అధికారులు స్వచ్ఛంద సంఘాల సహకారంతో పలు వార్డులలో బోరింగులు వేస్తున్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ మొదటి టర్మ్‌‌‌‌లోనే భగీరథ పూర్తి చేస్తామని చెప్పింది. 9 ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ పెద్దపల్లికి భగీరథ నీరు అందడం లేదు. గతంలో కాంగ్రెస్ ​హయాంలో ఎల్లంపల్లి నుంచి నీటిని పైపుల ద్వారా తీసుకొచ్చి, బొంపెల్లి గుట్ట మీద సంపు ఏర్పాటు చేసి పట్టణానికి నీరు అందించేవారు. ఇప్పటికీ పాక్షికంగా ఆ నీళ్లే అందుతున్నాయి. పట్టణంలో  మున్సిపల్ నల్లాలు రెండు రోజులకోసారి వస్తున్నాయి. దీంతో ప్రజలు నీటికి ఇబ్బంది పడుతున్నారు. కొందరు మినీ ట్యాంక్​ బండ్​ సమీపంలోని చేద బావి నుంచి నీరు తీసుకెళ్తున్నారు.  రూ.కోట్లు కేటాయించినా భగీరథ పనులు పూర్తికాకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

శాశ్వత పరిష్కారం లేనట్లేనా...


ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏటా పట్టణ ప్రగతి నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పట్టణాల్లో ఎక్కువగా తాగునీరు, శానిటేషన్‌‌‌‌ సమస్యలే ఉంటున్నాయి. ఏటా అధికారులు ఈ సమస్యలను రాసుకొని పోతున్నా.. వాటిని శాశ్వతంగా పరిష్కరించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది పట్టణ ప్రగతిలో తాగునీటి సమస్యపై ప్రజలు నిలదీయడంతో పెద్దపల్లి మున్సిపాలిటీలో బోరింగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా ప్రభుత్వ ధనంతో కాకుండా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు స్పాన్సర్ చేస్తేనే వేస్తున్నారు.  ప్రభుత్వం ప్రకటించినట్లుగా భగీరథ నీళ్లివ్వాలని.. ఇదేమని అడిగితే బోరింగులు వేయించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వార్డులో ఎక్కడో ఒక చోట బోరింగులు వేయిస్తే,  గతంలోలాగా నీళ్ల కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

టెస్టింగ్​ చేస్తున్నాం


 ‌‌‌‌‌‌‌‌హై స్టోరేజ్​ భగీరథ ట్యాంకులు పూర్తయినయి, పెద్దపల్లి పట్టణంలో  ఉన్న చిన్న చిన్న ట్యాంకులను టెస్టింగ్​ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్‌‌‌‌ ఏమైనా ఉంటే సరిచేస్తున్నాం. తొందరలోనే పట్టణ ప్రజలకు భగీరథ నీళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. 
- శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్​, పెద్దపల్లి