
యాదాద్రి, వెలుగు: “నేను 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న. ఆ టైమ్ లో ఎప్పుడూ కరువే. వాన పడిందంటే చెరువులు తెగిపోయేవి. 800 ఫీట్ల నుంచి 900 ఫీట్ల లోతు బోరు వేస్తేనే నీళ్లు పడేవీ. గొంగిడి సునీతమ్మ మంత్రాలు చేస్తే.. పైళ్ల శేఖర్ గాయి చేస్తే భూగర్భ జలాలు వట్టిగనే పెరగలే. మిషన్ కాకతీయతో పెరిగాయి. ఇప్పుడు 10 ఫీట్లు బోర్లు వేస్తే నీళ్లొస్తున్నయి” అని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన ఆఫీసర్లతో మాట్లాడారు. యాదాద్రి జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. అప్పట్లో చత్తీస్‌గఢ్ అడ్వైజర్‌ను కలిశానని, ఆయనే జిల్లాల ఏర్పాటుపై చెప్పారన్నారు. 10 లక్షల నుంచి 15 లక్షల జనాభా ఉంటే జిల్లాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అవసరమైతే 5 లక్షల జనాభా ఉన్నా జిల్లా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందుకే యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడిందన్నారు. యాదాద్రి జిల్లాలో భూముల ధరలు ఆకాశమంత పెరిగినయన్నారు. రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఎకరం రూ.40 వేలుండేదని ఇప్పుడు ఏ మూలకు వెళ్లినా రూ.24 లక్షల నుంచి రూ.30 లక్షలకు తక్కువ లేదన్నారు.
ఉద్యోగుల జీతాలు పెరుగుతయ్
ఒకప్పుడు గొర్రెలను దిగుమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు గొర్రెల సంపద పెరిగిపోయిందని కేసీఆర్ అన్నారు. దీని వెనుక ఉద్యోగుల కృషి ఉన్నదన్నారు. అభివృద్ధిలో కష్టపడుతున్న ఉద్యోగులకు జీతాలు ఇంకా కూడా పెరుగుతాయని, వాళ్లేమీ పాకిస్తాని వాళ్లు కాదన్నారు. రాష్ట్రంలో ఎవరిని వదిలిపెట్టకుండా పుట్టినోడి కాడ్నించి సచ్చిన వాళ్లకు కూడా స్కీంలు అమలు చేస్తున్నామన్నారు. రైతుబంధు అమలు చేస్తున్నామని, దళితబంధు కూడా పెట్టామన్నారు. కుండల ఉన్నది కాబట్టే దళితబంధు పెట్టినమన్నారు. కేంద్రం కాదన్నా వారికి నచ్చజెప్పి.. 95 శాతం ఉద్యోగాలు లోకల్స్ కు వచ్చే విధంగా చేయడం మన సర్కారు సాధించిన ఘనత అని అన్నారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల కలెక్టరేట్లను యాదాద్రి జిల్లా బిడ్డ ఉషారెడ్డి కడుతున్నారని పేర్కొన్నారు.