
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని స్టార్క్ మంగళవారం (సెప్టెంబర్ 2) అధికారికంగా తెలియజేశాడు. టీ20 వరల్డ్ కప్ కు మరో ఐదు నెలల సమయం ఉండగానే పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెబుతూ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చాడు. 35 ఏళ్ళ స్టార్క్ వన్డే, టెస్ట్ క్రికెట్ కు ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశాడు. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో చివరిసారిగా ఆస్ట్రేలియా తరపున ఆడిన ఈ పేసర్ ఏడాది కాలంగా ఆసీస్ టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
రిటైర్మెంట్ తర్వాత స్టార్క్ కారణాలు తెలిపాడు. " టెస్ట్ క్రికెట్ నాకు ఎప్పుడూ తొలి ప్రాధాన్యత. నేను ఆస్ట్రేలియా తరపున ఆడిన ప్రతి
టీ20 మ్యాచ్ ను ఆస్వాదించాను. ముఖ్యంగా 2021 వరల్డ్ కప్ నాకు ఫేవరేట్. ఎందుకంటే అప్పుడు మేము వరల్డ్ కప్ గెలిచి ఆనందంలో ఉన్నాం. ఇండియాలో జరగబోయే సిరీస్ తో పాటు యాషెస్, 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉండాలి. టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటే శారీరకంగా ఫిట్ గా ఉండొచ్చు". అని స్టార్క్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున తన టీ20 కెరీర్ పట్ల మిచ్ చాలా గర్వపడాలి అని సెలెక్టర్ల చైర్మన్ జార్జ్ బెయిలీ అన్నారు.
ఆస్ట్రేలియా తరపున టీ20 ఫార్మాట్‌లో స్టార్క్ తనదైన మార్క్ వేశాడు. పొట్టి ఫార్మాట్ లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ఆడమ్ జంపా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 2012లో పాకిస్థాన్‌తో స్టార్క్ టీ20 అరంగేట్రం చేశాడు. 13 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో మ్యాచ్ ల్లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడు. ఓవరాల్ గా తన కెరీర్ లో 65 టీ20 మ్యాచ్ లాడిన స్టార్క్.. 7.74 ఎకానమీతో 79 వికెట్లు పడగొట్టాడు. ఐదు టీ20 వరల్డ్ కప్ లు ఆడిన ఈ ఆసీస్ పేసర్.. 2021లో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో సభ్యుడు.
🚨 Mitchell Starc has retired from T20Is in order to prolong his international career in Tests and ODIs pic.twitter.com/yAwPhZscwm
— Cricbuzz (@cricbuzz) September 2, 2025