మిథాలీరాజ్​ రిటైర్మెంట్

మిథాలీరాజ్​ రిటైర్మెంట్
  • 23 ఏండ్ల కెరీర్‌‌లో ఎన్నో రికార్డులు సొంతం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : మహిళల క్రికెట్‌‌లో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. ఇండియా లెజెండరీ ప్లేయర్‌‌, హైదరాబాదీ మిథాలీ రాజ్‌‌ ఆటకు రిటైర్మెంట్‌‌ ప్రకటించింది. 16 ఏండ్ల వయసులో ఆడిన తొలి మ్యాచ్‌‌లోనే సెంచరీ కొట్టిన మిథాలీ రికార్డు స్థాయిలో 23 ఏండ్ల పాటు క్రికెట్‌‌కు ఎనలేని సేవలు అందించింది. 232 వన్డేల్లో అత్యధికంగా 7,805 రన్స్‌‌ చేసిన 39 ఏండ్ల మిథాలీ 89 టీ20లు, 12 టెస్టుల్లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అందరికంటే ఎక్కువగా10,868 రన్స్‌‌ సాధించింది. కెరీర్‌‌లో ఆరు వన్డే వరల్డ్‌‌ కప్స్‌‌ లో పోటీ పడ్డ ఆమె రెండు వరల్డ్‌‌ కప్స్‌‌లో  ఇండియాను ఫైనల్‌‌ చేర్చిన (2005, 2017) కెప్టెన్‌‌గానూ  రికార్డు సృష్టించింది. ప్లేయర్‌‌గా, కెప్టెన్‌‌గా మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మిథాలీ హైదరాబాదీ కావడం తెలంగాణకు గర్వకారణం. 

ఆటకు సెలవిక

మహిళల క్రికెట్‌‌‌‌‌‌లో అత్యుత్తమ ప్లేయర్‌‌‌‌, తన ఆటతో క్రికెట్‌‌‌‌కే వన్నె తెచ్చిన ఇండియా కెప్టెన్​, హైదరాబాదీ మిథాలీ రాజ్‌‌‌‌  23 ఏండ్ల సుదీర్ఘ  కెరీర్‌‌‌‌కు ముగింపు పలికింది. అన్ని రకాల ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించింది.  232 వన్డేల్లో రికార్డు స్థాయిలో 7805 రన్స్‌‌‌‌ చేసిన 39 ఏండ్ల మిథాలీ 89 టీ20లు, 12 టెస్టుల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 10,868 రన్స్‌‌‌‌ సాధించింది. కెరీర్‌‌‌‌లో ఆరు వన్డే వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌ పోటీ పడ్డ ఆమె రెండు వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌లో  టీమ్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేర్చిన (2005, 2017) కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించి రికార్డు సృష్టించిన రాజ్‌‌‌‌.. తన రిటైర్మెంట్‌‌‌‌ నిర్ణయాన్ని సోషల్‌‌‌‌ మీడియా ద్వారా వెల్లడించింది. కెరీర్‌‌‌‌కు పుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పెట్టినా మరో రకంగా ఆటకు సేవ చేస్తానని తెలిపింది.  ‘ దేశానికి ప్రాతినిధ్యం వహించడం అత్యున్నత గౌరవం. ఎత్తు పల్లాలతో సాగిన ఈ ప్రయాణంలో ప్రతి సంఘటన నాకు ఏదో ఒక ప్రత్యేకతను నేర్పింది. అదే సమయంలో  గడచిన 23 ఏండ్లు నా జీవితంలో అత్యంత సంతృప్తికరంగా, చాలెంజింగ్​గా, అద్భుతంగా గడిచాయి. అన్ని ప్రయాణాల మాదిరిగానే ఇది కూడా ముగియాలి. కాబట్టి ఈ రోజు నేను అన్ని ఫార్మాట్ల ఇంటర్నేషనల్​ క్రికెట్​ నుంచి రిటైర్​ అవుతున్నా ’ అని మిథాలీ రాసుకొచ్చింది. డొమెస్టిక్​ క్రికెట్​లో  కొన్నాళ్లు ఆంధ్ర టీమ్​కు ఆడిన మిథాలీ తర్వాత ఓ ఏడాది ఎయిర్‌‌‌‌ ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. 2000 నుంచి రైల్వేస్‌‌‌‌కు ఆడుతోంది. 

ఇదే సరైన సమయం..

ఇండియా టీమ్‌‌‌‌ సరైన వ్యక్తుల చేతుల్లో ఉండటంతోనే తాను కెరీర్‌‌‌‌ను ముగిస్తున్నానని మిథాలీ తెలిపింది. తనకు సహకరించిన బీసీసీఐ, ఫ్యాన్స్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపింది. ‘క్రికెటర్​గా నా ప్రయాణం ముగిసినా.. నేను ఎంతగానో ఇష్టపడే ఆటతో మరో రకంగా నిమగ్నమై ఉంటా. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమెన్స్​ క్రికెట్​ డెవలప్​మెంట్​కు కృషి చేస్తా’ అని రాజ్‌‌‌‌ రాసుకొచ్చింది. న్యూజిలాండ్‌‌‌‌లో ఏప్రిల్‌‌‌‌లో ముగిసిన వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇండియాకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించిన రాజ్​ ఆ తర్వాత ఆటకు దూరంగా ఉంది. 

చాన్స్‌ ఇస్తే క్రికెట్‌‌ అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తా : మిథాలీ

బాగా ఆలోచించి, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని మిథాలీ రాజ్‌‌ చెప్పింది. బీసీసీఐ అవకాశం ఇస్తే క్రికెట్‌‌ పరిపాలనలోకి వచ్చి సేవ చేసేందుకు సిద్ధమని తెలిపింది. ‘రిటైర్మెంట్‌‌ నిర్ణయం భావోద్వేగంలో తీసుకున్నది కాదు. న్యూజిలాండ్‌‌లో జరిగిన వన్డే వరల్డ్‌‌ కప్‌‌ నా చివరి టోర్నీ అని చెబుతూ వచ్చా. ఆ టోర్నీలో కనీసం సెమీస్‌‌ కూడా చేరుకోకపోవడం  వ్యక్తిగతంగా, టీమ్‌‌ పరంగా  నాకు చాలా నిరాశ కలిగించింది.  ఆ బాధ నుంచి బయటపడేందుకు సమయం పట్టింది. అందుకే డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌కు దూరంగా ఉన్నా. 2005, 2017 వరల్డ్‌‌ కప్స్‌‌ గెలవకపోవడం కూడా నా కెరీర్‌‌లో విచారకర సందర్భాలు.  అయితే, 2017 వరల్డ్‌‌ కప్‌‌లో ఫైనల్‌‌కు చేరుకోవడంతో ఇండియా విమెన్స్‌‌ క్రికెట్‌‌కు జనాదరణ లభించింది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. నా కెరీర్‌‌ ప్రారంభ రోజుల నుంచి ఈ క్షణం వరకు దేశంలో మహిళా క్రికెట్‌‌ వృద్ధిని చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. నా సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఏం చేయాలనే విషయంలో ముందున్న ఆప్షన్స్‌‌ను పరిశీలిస్తా. ఒకవేళ బీసీసీఐ అవకాశం ఇస్తే క్రికెట్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌లోకి రావడానికి ఇష్టపడతా. ఎందుకంటే ఈ ఆటను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ దశలో ప్లేయర్లకు ఏం అవసరమో నాకు తెలుసు’ అని మిథాలీ  చెప్పుకొచ్చింది.