ఎదురులేని రాయల్స్‌‌..రాజస్తాన్‌‌ ఖాతాలో ఎనిమిదో విజయం

ఎదురులేని రాయల్స్‌‌..రాజస్తాన్‌‌ ఖాతాలో ఎనిమిదో విజయం
  •     7 వికెట్ల తేడాతో ఓడిన లక్నో 

లక్నో: టేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్‌‌కు ఎదురులేకుండా పోయింది. ఎనిమిదో విక్టరీతో ప్లేఆఫ్స్‌‌కు మరింత చేరువైంది. కెప్టెన్ సంజూ శాంసన్ (33 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 నాటౌట్‌‌),  ధ్రువ్ జురెల్  (34 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 నాటౌట్‌‌)  ఫిఫ్టీలతో మెరవడంతో  శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో రాజస్తాన్  7  వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌‌పై గెలిచింది.

టాస్ ఓడిన లక్నో తొలుత 20 ఓవర్లలో 196/5  స్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్‌‌ రాహుల్ (48 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76), దీపక్ హుడా (31 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 50) ఫిఫ్టీలతో రాణించారు. సందీప్ శర్మ రెండు, ట్రెంట్ బౌల్ట్‌‌, అవేశ్‌‌, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఓపెనర్ డికాక్‌‌ (8)ను  బౌల్ట్‌‌, గత మ్యాచ్‌‌ హీరో మార్కస్ స్టోయినిస్ (0)ను సందీప్ శర్మ అద్భుతమైన డెలివరీలతో క్లీన్ బౌల్డ్‌‌ చేయడంతో తొలుత లక్నో 11/2తో తడబడింది.

అయితే, రాహుల్, హుడా మూడో వికెట్‌‌కు 115 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో రాహుల్ 31 బాల్స్‌‌లో.. హుడా 30 బాల్స్‌‌లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. వీళ్ల జోరు చూస్తుంటే లక్నో సులువుగా 200 ప్లస్ స్కోరు చేసేలా కనిపించింది. 13వ ఓవర్లో హుడాను ఔట్‌‌ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీయగా..  స్లాగ్‌‌ ఓవర్లలో రాజస్తాన్ బౌలర్లు కట్టడి చేశారు.  పూరన్‌‌ (11)ను సందీప్, రాహుల్‌‌ను అవేశ్ పెవిలియన్‌‌ చేర్చారు. బదోనీ (18 నాటౌట్‌‌), క్రునాల్ పాండ్యా (15 నాటౌట్‌‌) భారీ షాట్లు ఆడలేకపోవడంతో చివరి ఐదు ఓవర్లలో లక్నో 46 రన్సే చేసింది.

దాంతో 200లోపే పరిమితం అయింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్  19 ఓవర్లలో 199/3 స్కోరు చేసి గెలిచింది.  పవర్‌‌‌‌ ప్లేలో దంచికొట్టిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (34) తొలి వికెట్‌‌కు 60 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. మూడు బాల్స్ తేడాలో  ఈ ఇద్దరూ ఔటగా.. తొమ్మిదో ఓవర్లో రియాన్‌‌ పరాగ్‌‌ (14)ను అమిత్ మిశ్రా పెవిలియన్‌‌ చేర్చడంతో రాయల్స్‌‌ 78/3తో నిలిచింది.

ఈ దశలో కెప్టెన్ శాంసన్‌‌, ధ్రువ్ జురెల్ ధాటిగా ఆడి రాయల్స్‌‌ను రేసులోకి తెచ్చారు. బిష్ణోయ్‌‌ వేసిన 14వ ఓవర్లో  ధ్రువ్ మూడు ఫోర్లు, సిక్స్‌‌తో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో అతనిచ్చిన రెండు క్యాచ్‌‌లను యశ్‌‌ ఠాకూర్‌‌‌‌ డ్రాప్ చేశాడు. బిష్ణోయ్ తర్వాతి ఓవర్లో శాంసన్‌‌ 4, 4, 6 కొట్టడంతో లక్నో ఒత్తిడిలో పడిపోయింది. నాలుగో వికెట్‌‌కు అజేయంగా 122  రన్స్ జోడించిన  శాంసన్‌‌, జురెల్ మరో ఓవర్ మిగిలుండగానే జట్టును గెలిపించారు. శాంసన్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 196/5 (రాహుల్ 76, హుడా 50, సందీప్ 2/31).
రాజస్తాన్‌‌: 19 ఓవర్లలో 199/3 (శాంసన్ 71*, జురెల్ 52*, స్టోయినిస్ 1/3)