- పదవీ విరమణ పొందుతున్న రాజ్యసభ సభ్యులకు ఫేర్‌వెల్
- దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్లపై ప్రత్యేక ప్రశంసలు
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఫుల్ స్టాప్‌లు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు ఒక ఓపెన్ వర్సిటీ అని, పదవీ విరమణ చేస్తున్న సభ్యులు తమ అనుభవంతో దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఏప్రిల్, జులై మధ్యకాలంలో 59 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. ఇలాంటి సందర్భాలు పార్టీల మధ్య ఉన్న విభేదాలను సహజంగానే తొలగిస్తాయని అన్నారు. ‘‘మన సహచరులు ఇప్పుడు ఇతర రంగాల్లో సేవలందించేందుకు ముందుకు వెళ్తున్నారు. మళ్లీ సభకు తిరిగి వచ్చే ఆలోచన లేని సభ్యులకు నేను ఒకటే చెబుతున్నా.. రాజకీయాల్లో ఆగిపోవడం అంటూ ఏదీ ఉండదు.
భవిష్యత్తు మీ కోసం వేచి చూస్తున్నది. మీ అనుభవం దేశాభివృద్ధిలో ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుంది” అని తెలిపారు. పార్లమెంటరీ వ్యవస్థలోని రెండు సభల ప్రాముఖ్యతను ప్రధాని మోదీ వివరించారు. ఒక సభలో తీసుకున్న నిర్ణయం రెండో సభకు వెళ్లడం అనేది ‘సెకండ్ ఒపీనియన్’ తీసుకోవడం లాంటిదని, ఇది ప్రజాస్వామ్య నిర్ణయాధికారాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. రాజ్యసభలో గడిపే ఆరేండ్ల కాలం ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి, జాతీయ అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవడానికి దొరికిన అమూల్యమైన అవకాశం అని పేర్కొన్నారు. పాత, కొత్త పార్లమెంటు భవనాల్లో సేవలందించే అరుదైన అవకాశం కొంతమంది సభ్యులకు దక్కిందని గుర్తుచేశారు.
వారి సగం జీవితం పార్లమెంట్‌కే..
ముగ్గురు సీనియర్ నాయకులైన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సేవలను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు తమ సగం జీవితం పార్లమెంటరీ కార్యకలాపాల్లో గడిపారని ప్రశంసించారు. వారు ఇప్పటికీ సభకు హాజరవుతున్న అంకితభావం అద్భుతమని, కొత్త పార్లమెంటేరియన్లు వారిని చూసి నేర్చుకోవాలని సూచించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పైనా అభినందనలు కురిపించారు. ఆయన చాలా సున్నితమైన, మృదుస్వభావి అయినప్పటికీ, పని విషయంలో ఎంతో కఠినంగా ఉంటారని తెలిపారు.
