న్యూఢిల్లీ: ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకదానికి ప్రాతినిధ్యం వహించడం మామూలు విషయం కాదని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఫేవరెట్ ట్యాగ్ అంత సులభంగా రాలేదన్నాడు. దాని కోసం చాలా ఏళ్లుగా శ్రమించామని చెప్పాడు. ‘టీమిండియా ఒక ఆధిపత్య శక్తిగా ఎదగడం వెనక సామూహిక కృషి చాలా ఉంది. ఫేవరెట్‌గా మాకున్న పేరును చాలా కష్టపడి సంపాదించుకున్నాం. ఇది ప్రతి ఒక్కరి కృషి ఫలితం.
జట్టును ఈ స్థాయికి తీసుకురావడానికి హెడ్ కోచ్ గంభీర్‌తో పాటు ఇతర కోచింగ్ బృందం చాలా శ్రమించింది. అందుకే మేం వరల్డ్‌లో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందాం. మేం ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని ఫేవరెట్లుగానే చూస్తారు’ అని గిల్ పేర్కొన్నాడు. తన కంటే ముందు పాలిఉమ్రిగర్ అవార్డు గెలుచుకున్న వారి సరసన చేరడం చాలా ప్రత్యేకంగా ఉందన్నాడు.
‘నిస్సందేహంగా నా కంటే ముందు ఈ అవార్డు గెలుచుకున్న క్రికెటర్లు, లెజెండ్స్ మధ్య నా పేరు ఉండటం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారి ఇదో గొప్ప గౌరవంగా ఉంటుంది. క్రికెట్‌లో రాణించి బీసీసీఐ చేత గుర్తింపు పొందడం అపారమైన గౌరవంగా భావిస్తున్నా’ అని గిల్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ టైమ్‌లో టీమిండియా చూపిన పట్టుదలను ‘అద్భుతమైన ప్రయాణం’గా గిల్ అభివర్ణించాడు.
ఓటమి నుంచి సిరీస్‌ను డ్రా చేయడం చాలా గొప్పగా అనిపించిందన్నాడు. వెస్టిండీస్, ఆసియా కప్‌లోనూ రాణించామన్నాడు. రాబోయే టెస్ట్ క్యాలెండర్ తమకు చాలా ప్రాముఖ్యమైందన్నాడు. ‘మాకు కీలకమైన టెస్ట్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ మ్యాచ్‌ల్లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తామని ఆశిస్తున్నాం. మేం సులువుగా ఓటమిని అంగీకరించని జట్టుగా గుర్తింపు పొందాలనుకుంటున్నాం. అలాంటి లక్షణాలను ప్లేయర్లలో నింపాలని భావిస్తున్నాం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.
