మియాపూర్, వెలుగు: ఇంటి తాళాలు పగులగొట్టి విదేశీ కరెన్సీని దొంగలించిన ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మైనర్లను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. వారి వద్ద పలు దేశాలకు చెందిన లక్ష విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ డీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ బీకే ఎన్క్లేవ్ ప్రజయ్ షెల్టర్లో ఉండే పి. శ్రీనివాసులరెడ్డి మలేషియా వెళ్లేందుకు పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ తెచ్చుకొని పెట్టుకున్నాడు.
ఈ నెల 22న మెదక్ వెళ్లగా, అదే రోజు రాత్రి ఐడీఏ బొల్లారంకు చెందిన తరుణ్(20), సెంట్రింగ్ వర్క్ చేసే బాలుడు(17), లేబర్ పనిచేసే మరో బాలుడు(17)తో కలిసి శ్రీనివాసులురెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి విదేశీ కరెన్సీని దొంగలించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
