
మియాపూర్, వెలుగు: బైకులు, సెల్ఫోన్లు దొంగలిస్తున్న ఆరుగురిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు సీఐ దుర్గరామలింగ ప్రసాద్ తెలిపారు. హఫీజ్‌పేట్‌కు చెందిన షేక్ అబ్బు తాలీబ్(21), సలాం బిన్ అలీ(21), అబ్దుల్ రియాజ్(19), మహేశ్(19), సూర్యవంశీ(19)తోపాటు మరో మైనర్ బాలుడు చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. పనిచేయగా వచ్చే జీతం విలాసాలకు సరిపోకపోవడంతో వీరంతా గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు ప్లాన్ చేశారు. మెట్రో స్టేషన్స్, మాల్స్ వద్ద పార్క్చేసిన బైకులను రాత్రి వేళ దొంగిలించి, వీటిని అమ్మిపెట్టేందుకు మరో మైనర్ బాలుడికి ఇచ్చేవారు.
వచ్చిన డబ్బులతో అందరూ ఎంజాయ్ చేసేవారు. అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ప్రణయ్ తన బైక్ పోయిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వివరించారు. హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో సోమవారం నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి 16 బైకులు, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసులో సలాం బిన్ అలీ(21) పరారీలో ఉండగా, వీరు కొట్టేసిన బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్, యమహా ఆర్15, డ్యూక్, యమహా ఎంటీ వంటి ఖరీదైన బైకులు ఉన్నాయి. ముఠాకు లీడర్‌గా వ్యవహరిస్తున్న అబ్బు తాలీబ్ పై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే10 కేసులు నమోదైనట్లు సీఐ పేర్కొన్నారు.