మిజోరంలో ప్రతిపక్షానికే పట్టం.. ఓటమి పాలైన సీఎం, డిప్యూటీ సీఎం

మిజోరంలో ప్రతిపక్షానికే పట్టం.. ఓటమి పాలైన సీఎం, డిప్యూటీ సీఎం

మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తలకిందులయ్యాయి. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ కు గట్టి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి జోరంథంగాతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్- జెడ్పీఎం స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. దీంతో జడ్పీఎం అధ్యక్షుడు లాల్దుహోమా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం లాంఛనమైంది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21స్థానాలు అవసరం. ప్రస్తుతం  ZPM ఇప్పటికే 21 స్థానాల్లో విజయం సాధించి.. మరో  6 స్థానాల్లో ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం దిశంగా వెళుతోంది. ఇక ఎంఎన్ఎఫ్ మాత్రం కేవలం 6చోట్ల గెలిచి, మరో 4స్థానాల్లో ముందంజంలో ఉంది. రెండు చోట్ల బీజేపీ, ఒక చోట కాంగ్రెస్ గెలుపొందింది.

మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. రాష్ట్రంలో మొత్తం 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. అనంతకరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని తేల్చాయి.