తుంగతుర్తి, వెలుగు : రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సూచించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, తాలు లేకుండా కేంద్రాలకు తీసుకువచ్చి క్వింటాకు రూ. 2,320 మద్దతు ధర పొందాలని సూచించారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు సెల్‌ఫోన్లు, లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అంగన్‌వాడీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దయానంద్, ఎంపీడీవో శేషు కుమార్, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సొసైటీ సీఈవో యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
