రాజ్యాంగ రక్షణకు బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని సాంబశివరావు

రాజ్యాంగ రక్షణకు బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, వెలుగు :  రాజ్యాంగ రక్షణ కోసం లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. పదేండ్ల బీజేపీ పాలనలో దేశప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. లౌకిక విలువలు కాపాడుతుంది కేవలం వామపక్షాలు మాత్రమేనని చెప్పారు. శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 11 వామపక్షాల ఆధ్వర్యంలో ‘కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదం’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. 

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, పి.రంగారావు, ఎస్.వెంకటేశ్వరరావు, ఎ.మధు, గాధగోని రవి, జాన్ పాషా, జానకి రాములు, ప్రసాద్, ఎం.రమేశ్​రాజాతో పాటు కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ.. నిరంకుశ పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే, విమర్శించే వారిని మోదీ ప్రభుత్వం సహించడం లేదన్నారు. 

వీరయ్య మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో మెజార్టీ హిందువుల ఓట్లు పొందేందుకు మత విధ్వేషాలు సృష్టించేందుకు పూనుకుంటున్నారని ఆరోపించారు. పోటు రంగారావు మాట్లాడుతూ.. కేంద్రం ఈడీని కేడీగా మార్చి ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మత రాజ్య స్థాపన, కార్పొరేట్ల సంపద పెంపే లక్ష్యంగా బీజేపీ విధానాలను రూపొందించిందని విమర్శించారు.