కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
  • బాల్క సుమన్​ అనుచిత వ్యాఖ్యలపై కలెక్టర్, డీసీపీకి ఫిర్యాదు 
  •     బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ 


మంచిర్యాల, వెలుగు: చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్​కలెక్టర్​ సబావత్ మోతీలాల్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం మాట్లాడుతూ.. బాల్క సుమన్​జర్నలిస్టులకు నేరుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పటికే 48 గంటలు దాటిందని, క్షమాపణ చెప్పకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మంగళవారం సుమన్ దిష్టిబొమ్మ దహనం చేస్తామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. విలేకరులపై సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేశ్, సాగే సుమోహన్, బొడ్డు శంకర్, శంకర్ సంఘీభావం తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పింగిళి సంపత్ రెడ్డి, కోశాధికారి వంశీకృష్ణ, ఐజేయూ కౌన్సిల్ మెంబర్ కాచం సతీశ్, ఉపాధ్యక్షుడు చౌదరి సురేశ్, కార్యనిర్వాహక కార్యదర్శి కల్వల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రాజేశ్, రాజేశ్వర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.