ఏలూరులో హైడ్రామా... అర్థరాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్చల్ 

ఏలూరులో హైడ్రామా... అర్థరాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్చల్ 

ఏలూరులో హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం ( జూన్ 15 ) అర్థరాత్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశారు. తన కుటుంబసభ్యులపై టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన చింతమనేని...శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అర్థరాత్రి సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది.

గతంలో శ్రీనివాస్ చింతమనేని తరపు న్యాయవాదిగా ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు ముదరడంతో దెందులూరులో అక్రమాలు జరుగుతున్నాయంటూ మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు శ్రీనివాస్. ఈ క్రమంలో చింతమనేనితో ఆయనకు మద్దతిస్తున్నవారిపై కూడా విమర్శలు చేశారు శ్రీనివాస్. దీంతో శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు చింతమనేని.

ఈ క్రమంలో అనుచరులతో కలిసి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు చింతమనేని. అయితే.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస్ ను అరెస్ట్ చేయకుంటే అక్కడి నుంచి కదిలేది లేదని చింతమనేని పట్టుబట్టడంతో భారీ బందోబస్తు మధ్య శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. టీడీపీలో ఉంటూ వైసీపీ నేతలకు సహకరించడంతో పాటు క్రమశిక్షణ ఉల్లంఘించడంతో చర్యలు తీసుకున్నట్లు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ తెలిపారు.