తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలె

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలె

సిద్దిపేట : తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరాలని చాలా మంది ఎదురుచూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ అన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన ప్రధాని నరేంద్రమోడీ ఎనిమిదేండ్ల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఈటల నిప్పులు చెరిగారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ప్రజలు తనకు బ్రహ్మరథం పడితే.. అధికారపార్టీకి చెందిన మీడియా ఖాళీ కుర్చీలు చూపించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి కేసీఆర్కు ఇప్పటి కేసీఆర్కు చాలా తేడా ఉందని.. ఒకప్పుడు ఆయన టీవీలో కనపడితే యువత కేరింతలు కొట్టేవారని ఇప్పుడు చీదరించుకున్నారని అన్నారు. ఆనాడు సిద్దిపేట పొంగిపోతే నేడు కుంగిపోతోందని వాపోయారు.

టీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాలి
తాను పార్టీ మారలేదని, టీఆర్ఎస్ వాళ్లే వెళ్లగొట్టారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజీనామా చేయాలని రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని చెప్పారు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చిందని సటైర్ వేసిన ఈటల టీఆర్ఎస్ ను వీఆర్ఎస్ తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కు టైంకు మందు గోళీలు ఇ్చచేందుకు సంతోష్ కుమార్ కు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారని విమర్శించారు. సీఎం పదవిని కేసీఆర్ ఎడమకాలి చెప్పుతో పోల్చడం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. 

సమస్యలపై చర్చకు సిద్ధమా..?
రాష్ట్రానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం వెనుక ఎందరో ఆడబిడ్డల ఆర్తనాదాలు ఉన్నాయని ఈటల రాజేందర్ వాపోయారు. పబ్ ల కారణంగా అమ్మాయిల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని, హైదరాబాద్ లో ఉన్న ఈ విష సంస్కృతిని బీఆర్ఎస్ ద్వారా దేశం అంతటా పాకిస్తావా అని ప్రశ్నించారు. రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసిన సర్కారు కనీసం ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఎక్కడ చర్చ పెట్టినా వచ్చేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రజలది తప్ప పీకేది ఏం నడవదని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.