చెన్నూరులో త్వరలో రెండు స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్లు : వివేక్‌‌

చెన్నూరులో త్వరలో రెండు స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్లు : వివేక్‌‌
  •     క్వాలిటీ విద్య అందిస్తేనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది
  •     గత ప్రభుత్వం బడ్జెట్‌‌లో విద్యకు 6 శాతమే నిధులు ఇచ్చిందని వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు : కాంగ్రెస్ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, వచ్చే బడ్జెట్‌‌లో విద్యా రంగానికి 10 నుంచి 11 శాతం నిధులు కేటాయించేలా కార్యాచరణ రూపొందిస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోలేదని, బడ్జెట్‌‌లో 6 శాతం నిధులు మాత్రమే మంజూరు చేసిందన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, భీమారం, జైపూర్ మండలాల్లో వివేక్ వెంకటస్వామి పర్యటించారు. భీమారం మండల కేంద్రంలో రూ.30 లక్షలతో నిర్మించిన ఎమ్మార్సీ బిల్డింగ్‌‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు.

విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించినప్పుడే భవిష్యత్‌‌లో వారికి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అందుకోసం విద్యారంగానికి నిధులకు ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ పట్టించుకోకపోవడంతో చెన్నూరు నియోజకవర్గంలోని చాలా స్కూళ్లల్లో క్లాస్ రూమ్‌‌లు, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని స్కూళ్లల్లో వసతులను కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పిల్లల్లో స్కిల్ డెవలప్‌‌మెంట్‌‌ను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ఖజానాను ఖాళీ చేసిన్రు..

తెలంగాణను బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చి, ఖజానాను ఖాళీ చేసిందని వివేక్‌‌ వెంకటస్వామి మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేత పత్రం రిలీజ్ చేసిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో త్వరలో రెండు స్కీల్ డెవలప్‌‌మెంట్ సెంటర్లను ప్రారంభించి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని ఆయన తెలిపారు.

సింగరేణి ఓసీపీలు, జైపూర్ పవర్ ప్లాంట్‌‌లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించేలా సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడి సింగరేణి యాజమాన్యం ద్వారా సర్క్యులర్ తెచ్చుకున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్‌‌ను సన్మానించారు. అంతకు ముందు ఆయన చెన్నూరు పట్టణంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. జడ్పీటీసీ బూక్య తిరుమల, డీఈఓ యాదయ్య, కాంగ్రెస్ లీడర్లు చేకూర్తి సత్యనారాయణరెడ్డి, పోడెటి రవి, బుక్యా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.