
అసెంబ్లీ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని బీఆర్ఎస్ పూర్తిగా స్వాగతిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కానీ ఇలా ఎన్నికల ముందు తీర్మాణం చేసి.. దాని తర్వాత ఏం చేస్తారని ప్రశ్నించారు. కులగణన చేపట్టిన ప్రకారం తమకు రాజ్యాధికారం కావాలని.. ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
వెనుకబడిన కులాలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని కోరారు. కులగణపై తీర్మానం కాదు.. చట్టం ఎప్పుడు చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని.. ప్రభుత్వం వాటిని తీర్చాలన్నారు.
కులగణన, సర్వేకు తేడాలు ఏంటో ప్రభుత్వం చెప్పాలని అడిగారు గంగుల. కులగణనపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని తెలిపారు. కులగణన ఎలా చేస్తారో క్లారిటీ ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. కేవలం బీసీ కులగణే చేస్తే ఆ వర్గాలకు నష్టం జరుగుతుందని గంగుల అన్నారు. సర్వే చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో చట్టం చేస్తారో చెప్పాలన్నారు.