క్రీడలకు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రీడలకు,  క్రీడాకారులకు సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్​పూర్,  పటాన్​చెరు, వెలుగు: క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. ఈనెల 25 నుంచి 28వరకు కరీంనగర్​ జిల్లా కేంద్రంలో జరిగే 72వ సీనియర్​ కబడ్డీ రాష్ట్ర  స్థాయి పోటీలకు వెళ్తున్న సంగారెడ్డి జిల్లా పురుషులు, మహిళ జట్టుకు గురువారం రూ.30వేలతో కొనుగోలు చేసిన జెర్సీలను ఎమ్మెల్యే పటాన్​చెరులోని మైత్రి మైదానంలో క్రీడాకారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

పటాన్​చెరును క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. జనవరిలో జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పటాన్​చెరు ఆతిథ్యం ఇవ్వబోతున్నదన్నారు. కార్యక్రమంలో మైత్రి క్రికెట్​ క్లబ్​ అధ్యక్షుడు హనుమంత్​ రెడ్డి, సీఐ వినాయక్​రెడ్డి, సంగారెడ్డి జిల్లా అసోసియేషన్​ అధ్యక్షుడు ముక్తార్​జానీ, సంయుక్త కార్యదర్శి గౌతం, ఎల్లయ్య, నర్సింలు, శ్రీనివాస్​గౌడ్, పండు, శోభ పాల్గొన్నారు.

 జనవరి 4న ఆల్​ ఇండియా బాడీ బిల్డింగ్​పోటీలు

పటాన్​చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో జనవరి 4న ఆల్​ ఇండియా బాడీ బిల్డింగ్​పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పోటీలకు సంబంధించిన బ్రోచర్​ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్​చెరు నియోజకవర్గంలో మొదటి సారి జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్​ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 

తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ మెట్టు కుమార్​యాదవ్, మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ విజయ్​కుమార్, మైత్రి క్రికెట్​ క్లబ్​అధ్యక్షుడు హనుమంత్​రెడ్డి, నాయకులు మధుసూదన్​రెడ్డి, ఉపేందర్, లియకత్, పృథ్వీరాజ్, శివారెడ్డి, వెంకటేశ్, నిర్వాహకులు షకీల్, ఒమర్, క్రీడాకారులు పాల్గొన్నారు.  

ఏసుక్రీస్తు కరుణామయుడు

ఏసుక్రీస్తు కరుణామయుడని, ఆయన జీవితం, బోధనలు అందరికి అనుసరణీయమని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి అన్నారు. క్రిస్మస్​సందర్భంగా పటాన్​చెరు డివిజన్​ పరిధిలోని మెథడిస్ట్ చర్చి, పెంతెకోస్తు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.