అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు పట్టణ కేంద్రంలో ఏసీపీ ఆఫీస్ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. పటాన్చెరు కేంద్రంగా ఉండాల్సిన ఏసీపీ ఆఫీస్ ను ఆర్సీపూర్ పేరుతో రామచంద్రాపురం కేంద్రంగా ఏర్పాటు చేశారన్నారు.
దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. పటాన్చెరులో జాతీయ రహదారికి ఆనుకొని ఇటీవల 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డీఎస్పీ భవనానికి శంకుస్థాపన చేశామని, ఆ బిల్డింగ్‌లో ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేయాలని విన్నవించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్‌ను రామచంద్రాపురం ఏసీపీ పరిధిలోకి చేర్చాలన్నారు. బొల్లారం ఠాణాను యధావిధిగా కొనసాగించాలని, పటాన్చెరు కేంద్రంగా కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరగా.. డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే..
పటాన్చెరు కేంద్రంగానే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కోరారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ.కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. పటాన్చెరు కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఇటీవల పరిపాలన సౌలభ్యం పేరుతో తెల్లాపూర్ మున్సిపల్కార్యాలయంలోకి మార్చారన్నారు. దీనివల్ల పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. స్పందించిన కమిషనర్ పటాన్చెరు కేంద్రంగానే సర్కిల్ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
