గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే మాటలు నీటిపై రాతలు

గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే మాటలు నీటిపై రాతలు

ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్లపై ఆయన హామీలు నీటిపై రాతలే: షర్మిల విమర్శ

అచ్చంపేట, వెలుగు: ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్​లను ఏర్పాటు చేసి నల్లమలకు సాగునీరు అందిస్తామని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే గువ్వల బాల్​రాజ్​ మాటలు నీటిపై రాతలుగానే మిగిలిపోయాయని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా శుక్రవారం అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన రోడ్​ షోలో ఆమె మాట్లాడారు. ప్రజల సెంటిమెంట్​ను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్​ ముఖ్య మంత్రి అయ్యాక అచ్చంపేటకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్​రాజ్​ ఓ దళిత దొర అని, ప్రభుత్వ, అసైన్డ్​ భూములు కబ్జా చేయడం, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం ఆయన నైజమని ఆరోపించారు. నేరెళ్ల మరియమ్మ అనే దళిత మహిళను జైల్లో చంపితే దళిత ఎమ్మెల్యే అయి ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదని గువ్వలపై ఆమె ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారి పై దాడి చేసే సిగ్గు మాలిన ఎమ్మెల్యేకు కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉమ్మడి మహబూబ్ నగర్​ దాటే వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి యాత్ర కొనసాగిస్తానని తెలిపారు. కేసీఆర్​ ప్రభుత్వానికి త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.