యూరియా సరఫరాలో సర్కారు ఫెయిల్..రైతుల కష్టాలనూ రాజకీయం చేస్తున్నరు: హరీశ్ రావు

యూరియా సరఫరాలో సర్కారు ఫెయిల్..రైతుల కష్టాలనూ రాజకీయం చేస్తున్నరు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రైతులకు యూరియా సరఫరాలో కాంగ్రెస్​ ప్రభుత్వం అట్టర్​ ఫ్లాప్​ అయిందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు విమర్శించారు. రైతుల కష్టాలనూ రాజకీయం చేస్తున్నారన్నారు. రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. ప్రతిపక్షాల దుష్ప్రచారం అంటూ అధికార పక్షం ప్రచారం చేయడం సిగ్గుచేటని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘కుండపోత వానలో తడుస్తూ రైతులు గంటల కొద్దీ నిలబడటం అబద్ధమా? ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు, చెప్పులు క్యూలైన్లలో పెట్టడం అబద్ధమా? సీఎంకు ముందు చూపు లేకపోవడంవల్లే రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తున్నది. 

నాటి రోజులు తెస్తామని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి.. అన్నమాట నిలుపుకుంటున్నడు. మల్లా కాంగ్రెస్ దుర్మార్గ పాలననాటి పాత రోజులను తీసుకొచ్చిండు. మిస్ వరల్డ్ పేరిట రెండు నెలలు పాలనను గాలికి వదిలేసిండు తప్ప.. ఎరువులు, విత్తనాల గురించి సీఎం  సమీక్షలు చేయలేదు. బాధ్యత లేదు, ప్రణాళిక లేదు, కార్యాచరణ లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్రానికి ఎరువుల కొరత వచ్చింది’’ అని హరీశ్​ రావు విమర్శించారు.