- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
చండ్రుగొండ/అన్నపురెడ్డిపల్లిఅశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు : గ్రామీణప్రాంత మహిళలను అన్ని రంగాల్లో చేయూత కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శనివారం చండ్రుగొండ మండలంలోని తుంగారం, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.
ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో స్వయం సహాయ సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్, డీఆర్ డీఏ పీడీ విద్యాచందన, నాయకులు పాల్గొన్నారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
దమ్మపేట మండల పరిధిలో శ్రీరాంపురం, లింగాలపల్లి, జమీదార బంజర, మందలపల్లి గ్రామాల పరిధిలో రూ.47 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ముందుగా మండలంలోని మొండివర్రేలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. పునాది దశలో ఉన్న ఇండ్లను నిర్మాణానికి త్వరలో పరిష్కారం చూపిస్తానని పేర్కొన్నారు.
