హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. వరంగల్ పర్యటన సందర్భంగా కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి దమ్ము ఉన్న నాయకుడని.. కేటీఆర్ మాదిరిగా అయ్య అండ చూసుకొని రాజకీయాలు చేయట్లేదని విమర్శించారు. కేసీఆర్ లేకపోతే నిన్ను అడిగేవారెవరు..? కేసీఆర్ లేకపోతే నీ ఐడెంటిటీ ఎక్కడిది..? కేటీఆర్‌ను ప్రశ్నించారు.
కడియం శ్రీహరికి కుటుంబ రాజకీయాలు లేవని.. స్వతహగా ఎదిగొచ్చిన నాయకుడని అన్నారు. విలువలు, నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా.. గత పదేళ్లలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏమైపోయినవి ఈ విలువలు అని ప్రశ్నించారు. ఆ రోజు ఏం పీకుతున్నవ్.. కేసీఆర్ తప్పు అని అప్పుడు ఎందుకు చెప్పలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదన్నారు.
కేటీఆర్ నాయకత్వంపై సందేహాలున్నాయని.. అతడి దగ్గర పని చేయలేకనే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిందన్నారు. కేటీఆర్ అంటేనే ఐరన్ లెగ్ అని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతడి నాయకత్వంలో పని చేయలేకపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కోసమే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని.. సమయం చూసి హరీష్ రావు కూడా ఆయన దారి ఆయన చూసుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కేటీఆర్ నాయకత్వం పనికి రాదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలుసన్నారు. ఇకనైనా అహంకారం, బలుపుతో మాట్లాడటం మానేయాలని హితవు పలికారు. పెద్ద నాయకునివి కావాలంటే బలుపు, అహంకారం తగ్గించుకోవాలని సూచించారు.
