ఆయన నగరానికే మంత్రి : ఎమ్మెల్యే సెటైర్

ఆయన నగరానికే మంత్రి : ఎమ్మెల్యే సెటైర్
  • ఉత్తరాంధ్ర వైసీపీలో మంత్రిపదవి రగడ

మంత్రి పదవుల కేటాయింపుపై ఉత్తరాంధ్రాలో మంటలు మొదలయ్యాయి. నేరుగా అధిష్టానాన్ని వ్యతిరేకించే ధైర్యం లేకపోయినా.. ఎంపికైన మంత్రులపై… ఇన్ డైరెక్టుగా సెటైర్లు పేలుతున్నాయి. ఉత్తరాంధ్రాలో మంత్రులతో ఎమ్మేల్యేలకు అప్పుడే చెడిన వాతావరణం కనిపిస్తోంది.

మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం జరిగిందని వైసీపీ అధిస్టానం భావిస్తున్నా.. జిల్లాలవారీగా చాలామంది ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. శ్రీకాకుళంలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుని కాదని అతని సోదరుడు కృష్ణదాస్ కి మంత్రి పదవి ఇవ్వడం కేడర్ లో అసంతృప్తికి కారణమైంది.

విశాఖజిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలకు గానూ 11 మంది వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. ఇందులో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కు టూరిజం మంత్రిని చేయడంపై… జిల్లాలోని రూరల్ ఎమ్మెల్యేలు అంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి అవంతికి జరిగిన అభినందన సభలో చొడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నగరంలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు కోల్పోవడంతో రాబోయే GVMC ఎన్నికల్లో మేయర్ ను గెలిపించే బాధ్యతతోనే అవంతికి మంత్రిపదవి ఇచ్చారని, ఆయన నగరానికి మాత్రమే మంత్రి అని చెప్పడం అక్కడివారందర్ని అవాక్కయ్యేలా చేసింది. రూరల్లో జెడ్పీ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్ పీటీసీ సర్పంచ్ పదవులన్నీ తాము గెలిపించుకుంటామని కూడా అన్నారు.

ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తప్పుబట్టారు సీనియర్ ఎమ్మెల్యేగా కరణం ధర్మశ్రీ అలా మాట్లాడకూడదని అన్నారు. దీనివల్ల ప్రజలు, కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. మంత్రి అంటే నగరానికి కాదని, రాష్ట్రానికని స్పష్టం చేశారు.

ద్రోణంరాజు సూచనతో ఎమ్మెల్యే ధర్మశ్రీ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే నేతలు పార్టీకి నష్టం కలిగేలా కామెంట్స్ చేయొద్దంటున్నారు వైసీపీ కార్యకర్తలు.