ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే: కూనంనేని

ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే: కూనంనేని

శంషాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ కు నేడు అభ్యర్థులు లేక విలవిలలాడుతుందని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు.  భవిష్యత్ లో బీఆర్ఎస్ దుకాణం మూసి వేయడం తథ్యం అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ఎలైట్ బ్రాండ్ హోటల్  లో  సీపీఐ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలనలో బీఆర్ఎస్ నేతలు రాజభోగాలు అనుభవించారని, తెలంగాణకు కేసీఆర్ ఒక మహరాజ్ గా, కేటీఆర్ ఒక యువరాజుగా చెలామణి అయ్యారని పేర్కొన్నారు. 

పార్లమెంటు ఎన్నికల్లో ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలవడమే కష్టంగా బీఆర్ఎస్ పరిస్థితి మారిందని గెలిచినా కూడా ఆ పార్టీలో ఉంటారో ఉండరో తెలియదన్నారు. ఎంత వేగంగా బీఆర్ఎస్ భవనాన్ని నిర్మించారో అంతేవేగంగా పేకమేడలా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు. పార్టీ ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి వెనకాడిన కేసీఆర్ ఈరోజు ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేవాడే లేకుండా పోవడం బాధాకరమన్నారు. వచ్చే కాలంలో విప్లవ పోరాటాలకు నాంది పలికి కార్మిక వర్గ పోరాటాలు, రైతు కూలీల పోరాటాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేతలు శంకర్ నారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆంధ్రచారి , కంట్రోల్ కమిషన్ సభ్యుడు పుస్తకాల నర్సింగరావు, రాష్ట్ర సమితి సభ్యుడు పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.