రామచంద్రాపురం, వెలుగు: విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ స్కూల్లో నూతనంగా నిర్మించిన లైబ్రరీని ఆయన ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చదువుకునే విద్యార్థులు వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, పుస్తక పఠనం జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేసేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేశ్, ఎంఈఓ పీపీ రాథోడ్, అంజయ్య, పరమేశ్ యాదవ్, ఐలేశ్, కుమార్ గౌడ్, ప్రమోద్ గౌడ్ పాల్గొన్నారు.

