V6 News

తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన కావాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన కావాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  •     కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు అమ్మ, అయ్య పాలన కాదు, ప్రజాపాలన కావాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమ్మ పాలన తీసుకొస్తానని పార్టీ ఆవిర్భావ సభలో కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శనివారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పాపాలను కవిత ప్రశ్నించి ఉంటే.. ఇప్పుడు ఆమె మాటలను తెలంగాణ ప్రజలు నమ్మేవారని అన్నారు. ఇప్పటివరకు జరిగిన అయ్య పాలనలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు చూశారని, ఇప్పుడు అమ్మ పాలన రావాలని కవిత అంటే .. ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కవిత చెప్పడం కాదు, దీనిపై ఆమె అప్రూవర్ గా మారాలని డిమాండ్​చేశారు.  మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు అని కవిత మాట్లాడడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నందుకు, పేదలను ఆదుకుంటున్నందుకు సీఎం కర్కోటకుడు అయ్యాడా..? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్​రెడ్డిని విమర్శించే అర్హత కవితకు లేదని హెచ్చరించారు.