ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

బచ్చన్నపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, కేసీఆర్, కవితలను టచ్ చేస్తే తెలంగాణ భగ్గుమంటదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేటలో టీఆర్ఎస్ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. బచ్చన్నపేటను మున్సిపాలిటీ చేసేందుకు కృషి చేస్తానన్నారు. నాడు కరువుకాటకాల్లో ఉన్న మండలం నేడు సాగు నీటితో కళకళలాడుతుందన్నారు. తరిగొప్పుల, నర్మెట మండలాలను కలుపుకొని బచ్చన్నపేటలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మండలకేంద్రంలో జూనియర్ కాలేజీ మంజూరుకు కేసీఆర్ తో మాట్లాడుతానన్నారు. ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, జిల్లా రైతుబంధు కన్వీనర్ ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్​గిరోబోయిన భాగ్యలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్ తదితరులున్నారు.

టార్గెట్​కు దూరంగా కొనుగోళ్లు

జనగామ, వెలుగు: సర్కారు ధాన్యం కొనుగోళ్ల ప్రకియ టార్గెట్  కు దూరంగా సాగుతోంది. గత సీజన్​ కొనుగోళ్లతో పోలిస్తే ఈ సీజన్​ లో రైతులు ఎక్కువగా ప్రైవేట్ కే మొగ్గు చూపారు. బహిరంగ మార్కెట్​ లోనూ మంచి ధర లభిస్తుండడంతో సర్కారు సెంటర్​లకు ధాన్యం రాక తగ్గింది. జనగామ జిల్లాలో కొనుగోళ్లు దాదాపు చివరిదశకు చేరుకుందని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ ధాన్యం సేకరణ లక్ష్యం సగానికి కూడా చేరలేదు. మరోవైపు సెంటర్లలో ధాన్యం రాశులు పలుచబడ్డాయి.

84 వేల మెట్రిక్​ టన్నులు..

జనగామ జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 12 వేల ఎకరాల్లో వరి సాగైంది. ఆఫీసర్లు ఈ సీజన్​ లో రెండు లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్​ గా పెట్టుకున్నారు. ఇందుకోసం 179 కొనుగోళ్ల సెంటర్​ లను ఏర్పాటు చేశారు. ఇందులో 97 పీఏసీఎస్, 82 ఐకేపీ వారివి ఉన్నాయి. కొనుగోళ్ల కిరికిరిలు షరా మామూలుగా ఉండడం, బయట మార్కెట్​ లో ఇంచు మించు మంచి ధర రావడం, దీనికి తోడు సెంటర్ల ప్రారంభం ఆలస్యంగా జరగడం వంటి కారణాలతో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు కే అమ్ముకున్నారు. ప్రైవేటులోనూ రూ.1,900 ధర లబించింది. స్టేషన్​ ఘన్​పూర్​ ఏరియాలో రైస్​ మిల్లర్లు సన్నాలకు క్వింటాలుకు రూ.2,400లు ధర పెట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో సర్కారీ సెంటర్లలో  ఇప్పటివరకు 16,209 మంది రైతుల వద్ద 84, 137 మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 10,500 మంది రైతులకు చెల్లింపులు జరిగాయి. మరో 5 వేలకు పైగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు రూ 111 కోట్ల మేర ధాన్యం డబ్బుల చెల్లింపులు జరిగాయి. గత సీజన్​ లతో పోలిస్తే ఈ సీజన్ లో డబ్బులు త్వరగానే ఖాతాల్లో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సెంటర్లలో కొంత మేర ధాన్యం రాశు లు కాంటాలకు సిద్ధంగా ఉండగా వీటిని పూర్తి చేసి కొద్ది రోజుల్లో సెంటర్​లు క్లోజ్​ చేయనున్నారు. గత వానాకాలం సీజన్​లో లక్షా 38 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ సారి కనీసం ఈ మార్క్​ ను కూడా చేరే పరిస్థితులు కనిపించడం లేదు.

యాసంగి పనుల్లో రైతులు...

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న క్రమంలో రైతులు యాసంగి పనులలో నిమగ్న మయ్యారు.  నారు మడుల దున్నకాలు చేపడుతున్నారు. మడికట్లను సిద్ధం చేస్తున్నారు. విత్తనపు వడ్లను కొనుగోలు చేస్తుండడంతో ఫర్టిలైజర్​ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల రైతులు నార్లు పోశారు. పలువురు రైతులు దున్నకాలు కూడా స్టార్ట్​ చేస్తున్నారు. ఆలస్యంగా నాట్లు వేస్తే వేసవిలో వడగండ్ల వానల ప్రభావం పడుతుందనే భయంతో ముందస్తు నాట్లకు రెడీ అవుతున్నారు. ఎండలు ముదరక
ముందే వేసవిలో వరి కోతకు రావాలనే తీరుగా తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేసుకుంటున్నారు.


కొత్త విద్యా విధానాన్ని రద్దు చేయాలి:  ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

హనుమకొండ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్​లో నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కొత్త విద్యా విధానం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. టీచర్ల నియామకాలు, ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్, రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, బండి నరసింహారావు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు ఈ మీటింగ్ కు ఎమ్మెల్యే నరేందర్ అటెండ్ అయ్యారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

తెలంగాణపై బీజేపీ కుట్ర

స్టేషన్ ఘన్​పూర్, వెలుగు: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. నియోజకవర్గంలోని 36 మంది లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణపై బీజేపీ, ఇతర పార్టీలు దాడులు చేస్తున్నాయని, సమాజం దీనిని గమనించాలని కోరారు. తెలంగాణలో వైఎస్ షర్మిలకు స్థానం లేదని, లక్ష్మీపార్వతికి పట్టిన గతే షర్మిలకు పడుతుందని విమర్శించారు. దళితబంధు పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం త్వరలో గైడ్​లైన్స్ రిలీజ్ చేస్తుందని, ఆశావహులు ఎలాంటి పైరవీలు, రాజకీయ నాయకులను నమ్మి మోసపోవద్దని సూచించారు.