- గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతే
- ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ధీమా
జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం యూసఫ్‌గూడలోని తన కార్యాలయంలో ఆయనను నాయకులు సన్మానించారు. పార్టీ ఆదేశాలతో హుజూరాబాద్‌లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించామని తెలిపారు. ఒకప్పుడు బలమైన కంచుకోటగా భావించిన బీఆర్ఎస్కు అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన 16 మంది వార్డు సభ్యులు విజయం సాధించగా, మరో అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారని, బీఆర్ఎస్ స్వల్ప మెజారిటీతో 8 వార్డులు గెలుచుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు.
