రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నారు

 రేవంత్  రెడ్డి వల్లే కాంగ్రెస్ నుంచి  బయటకు వస్తున్నారు
  • పార్టీ మారితే బలిదేవత..తల్లి తెలంగాణ అవుతదా..?
  • రేవంత్ కు  విలువలు, వలువలకు తేడా తెలియదు
  • నాణేనికి బొమ్మ బోరుసులా కాంగ్రెస్, టీఆర్ఎస్ లు 
  • చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఏజెంట్
  • రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

రాజకీయాల్లో  విలువలు, వలువలకు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు.  రేవంత్ రెడ్డి ఏ పార్టీలో చేరితో  ఆ పార్టీ నాశనం అవుతుందన్నారు.  రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని తీవ్రంగా విమర్శించారు.  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఒకప్పుడు బలిదేవత అన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ తెలంగాణ తల్లి అంటున్నాడని ఎద్దేవా చేశారు. అసలు బలిదేవత.. తల్లి ఎలా అవుతుందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.  టీడీపీలో గెలిచిన రేవంత్ రెడ్డి  ఆ పార్టీకి రాజీనామా చేయకుండా..పార్టీ మారారని  విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారారని.. ఏ వ్యాపారం కోసం పార్టీ మారారని..రఘునందన్ రావు ప్రశ్నించారు. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. 

ఓటుకు నోటు కేసులో దొరికాడు..
 తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్రేంటని రఘునందన్ రావు ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఏజెంట్ అని చురకలంటించారు.  ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ  రేవంత్ అని ఘాటుగా విమర్శించారు. రాజగోపాల్ రెడ్దిని మునుగోడు ప్రజలు మళ్లీ గెలిపిస్తారని అన్నారు. నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.  రేవంత్ రెడ్డి భాషలో సమాధానం చెప్పేందుకు తాము సిద్ధమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని..మునుగోడు ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే రఘునందర్ రావు జోస్యం చెప్పారు. 

కాంగ్రెస్ ఖాళీ అవడం ఖాయం..
కాంగ్రెస్ ఢిల్లీలో లేదు..కాంగ్రెస్ గల్లీలో రాదు అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎక్కడా అధికారంలోకి రాలేని కాంగ్రెస్కు అధ్యక్షుడివి అయ్యావని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటున్నారని చెప్పారు.  కాంగ్రెస్ పునర్జీవనం సాధ్యం కాని పని అని  స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ నుంచి నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. నాణేనికి బొమ్మ బోరుసులా కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఉన్నాయని రఘునందన్ రావు విమర్శించారు.  రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏమైందో.. కాంగ్రెస్‌కూ అదే గతి పడుతుందని రఘునందన్ రావు చెప్పారు.