లిక్కర్ నోటిఫికేషన్ వేస్తరు..కానీ ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి చేయరు

లిక్కర్ నోటిఫికేషన్ వేస్తరు..కానీ ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి చేయరు

తొమ్మిదిన్నర ఏండ్లలో తెలంగాణలోని అనేక భూములను కేసీఆర్ అమ్మారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. అఖరికి స్మశానం భూములు కూడా అమ్మిన ఘనత కేసిఆర్ ది అని మండిపడ్డారు. వేల కోట్ల భూములు అమ్మి నెలకు రూ. 3 వేలు ఇస్తామని చెబుతున్నారని.. తెలంగాణ భూములు అమ్మడం కోసమేనా  తెలంగాణ తెచ్చకున్నాం అని ప్రశ్నించారు. నీళ్ళు,నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని..కానీ ఇవేవి నెరవేరలేదన్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో బిజేపి బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. 

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  ఉద్యోగం రాక తీవ్ర ఆవేదనతో ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవల్లిక ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే.. లవ్ ఫెయిల్ అయి చేసుకుందని పోలీసులతో  నీచంగా అబద్దం చెప్పించారని మండిపడ్డారు. కేసీఅర్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి కాలేదన్నారు. కేసీఅర్ వచ్చిన తరువాత ఇచ్చిన ఏకైక నోటిఫికేషన్ లిక్కర్ నోటిఫికేషన్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో మహిళలకు సరైన గౌరవం, స్థానం కేసీఅర్ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. జై తెలంగాణ అన్న వారికి మంత్రి పదవి ఇవ్వకుండా.. పక్క పార్టీలో నుండి వచ్చిన వారికి ఇచ్చాడని మండిపడ్డారు. మహిళలకు సముచితం స్థానం ఇచ్చి.. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అధికారంలోకి రావాలన్నారు. శేరిలింగంపల్లిలో బిజేపి జెండా ఎగరాలని...రవికుమార్ యాదవ్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.