
ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి లేకున్నా పర్లేదని మునుగోడు ప్రజల కోసం ఇక్కడే నుండి పోటీ చేశానని చెప్పారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణి చేశారు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డివో శ్రీదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు అందించారు. పేదలకు అండగా ఉండడానికి ప్రతిక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే వేలకు వేల రూపాయలు దళారుల చేతిలోకి వెళ్లాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం ప్రతి పేదవాడి కంచంలో మెతుకైంది. నాడు వైఎస్ హాయంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చింది. నేడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వస్తున్నాయి . సంక్షేమ పథకాలు నిజమైన పేదవాళ్లకు వెళ్ళాలి... దళారుల చేతికి వెళ్లొద్దు. నిబంధనల వల్ల చిన్న చిన్న కారణాలతో నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు . వాటిని సడలించి నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐ మునుగోడు టికెట్ అడిగింది. నన్ను హైద్రాబాద్ LB నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు.అందుకే మునుగోడు నుంచి పోటీ చేశా అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.