వైరా, వెలుగు : మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. ఆదివారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 264 మంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దీవించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు లబ్ధిచేకూరలేదని, కేవలం రెండేండ్ల వ్యవధిలోనే ప్రజా ప్రభుత్వంలో నియోజకవర్గంలో సుమారు 4,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు త్వరలోనే గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రెండో విడత ఏప్రిల్ లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూర్, కొణిజర్ల, వైరా మండలాలకు చెందిన 143 మంది లబ్ధిదారులకు రూ.43.80 లక్షల విలువైన సీఎంఆర్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, కాంగ్రెస్మండల అధ్యక్షుడు శీలం వెంకటనర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఏదునూరు సీతారాములు, మున్సిపల్ మాజీ చైర్మన్ జైపాల్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
