వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను : సంజయ్ కుమార్

 వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను :  సంజయ్ కుమార్

కొందరు నాయకులు తనపై వ్యక్తిగత దూషణలకు దిగడం బాధ కలిగించిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో చేపట్టిన మీరు నేను కార్యక్రమంలో భాగంగా ఆయన రాయికల్ మండలంలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని సంజయ్ చెప్పారు. దొర అని.. గడీల పాలన చేస్తున్నానని కొందరు వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమన్న ఆయన.. తనకు గడీలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. రాజకీయాలలో వ్యక్తిగతంగా దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను ఓట్లు అడగనని అన్నారు.

వృత్తిరీత్యా డాక్టరైన తాను ఓట్లు అడగడం కంటే వైద్యం చేసుకోవడంలోనే ఆనందం ఉందని సంజయ్​ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా కష్టపడుతున్నప్పటికీ కొంతమంది కులమతాల పేరుతో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడటాన్ని సంజయ్ కుమార్ తప్పుబట్టారు.