స్క్రీన్ షాట్లతో పోలీసులకు కౌంటరిచ్చిన సీతక్క

స్క్రీన్ షాట్లతో పోలీసులకు కౌంటరిచ్చిన సీతక్క
  • ప్రజలకు పోలీసుల మీద నమ్మకం రావాలి కానీ పోకూడదు
  • తమ వాహనం అడ్డగింతపై ఏసీపీ వివరణను తప్పుబట్టిన సీతక్క

ఎమ్మెల్యే సీతక్క తల్లికి ప్లాస్మా ఇవ్వడం కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఆమె బంధువులను డీసీపీ రక్షితామూర్తి అడ్డుకున్నారు. పాస్ ఉన్నా కూడా ఆపడమేంటని ఆమె పోలీసులను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు సమాధానంగా ఏసీపీ రంగస్వామి బదులిచ్చారు. సీతక్క వాహనాన్ని ఆపిన విషయంతో డీసీపీ రక్షితామూర్తికి సంబంధం లేదని ఆయన అన్నారు. తమ సిబ్బంది సీతక్క ఫ్యామిలీకి చెందిన వాహనాన్ని హైదరాబాద్‌కు వస్తుంటే ఆపలేదని.. ములుగు వెళ్తుంటే ఆపినట్లు ఏసీపీ రంగస్వామి చెప్పారు. ఇదంతా అబద్దమని సీతక్క అన్నారు. తమ వాహనం ములుగు వెళ్లింది తెల్లవారుజామున ఒంటిగంటకు అని.. ఆ సమయంలో ఆపి ఉంటే వీడియోలో చీకటి ఉండాలి కదా అని ఆమె అన్నారు. తమ వాహనం ప్రయాణానికి సంబంధించి టోల్‌గేట్ ఫీజు కట్ అయిన మెసెజ్‌లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘సీతక్క అయినా పోలీసులు అయినా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. నా తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి అబద్ధం ఆడే అవసరం నాకు లేదు. ఆ కార్‌ని పోలీసులు అడ్డుకుంది జూన్ రెండో తారీకు మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో హైదరాబాద్ వస్తుంటే అడ్డుకున్నారు. అదే వాహనము మరలా తిరిగి జూన్ మూడో తారీకు తెల్లవారుజామున ఒంటి గంటకి ములుగు బయలుదేరింది. మరి మీరు వాహనం ములుగు వెళ్లేటప్పుడు పట్టుకుంటే.. వీడియోలో చీకటి ఉండాలి కదా? ఇది జరిగింది డే టైంలో అని క్లియర్‌గా కనిపిస్తుంది. మీరేమో ములుగు వెళ్తుంటే పట్టుకున్నామని అంటారు. ప్రజలకు పోలీసుల మీద నమ్మకం రావాలి కానీ నమ్మకం పోకూడదు’ అని సీతక్క అన్నారు.

సీతక్క తల్లికి కొన్ని రోజుల క్రితం కరోనా సోకి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీతక్క తల్లికి ప్లాస్మా అవసరమవడంతో ఆమె కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేయడానికి హైదరాబాద్‌కి బయలుదేరారు. అందుకోసం ములుగు కలెక్టరెట్ నుంచి వెహికిల్ పాస్ కూడా తీసుకున్నారు. అయితే సీతక్క కుటుంబసభ్యులు హైదరాబాద్‌కి చేరుకోగానే.. డీసీపీ రక్షితా మూర్తి వారి వాహనాన్ని ఆపారు. పాస్ ఉన్నా కూడా పట్టించుకోకుండా.. లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేశారంటూ.. వాహనాన్ని అర్దగంట పాటు పక్కకు ఆపి ఫైన్ వేశారు. తాము సీతక్క మనుషులమని.. తమకు పాస్ ఉందని చెప్పినా వినిపించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. చివరకు అర్ధగంట తర్వాత డీసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత.. ఆమె కిందిస్థాయి అధికారి పరిస్థితిని అర్థం చేసుకొని.. సీతక్క బంధువుల వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు.