ఎమ్మెల్యే సీతక్క ఫ్యామిలీకి చేదు అనుభవం

ఎమ్మెల్యే సీతక్క ఫ్యామిలీకి చేదు అనుభవం
  • సీతక్క తల్లికి కరోనా.. ఆస్పత్రిలో సీరియస్
  • బ్లడ్ డొనేషన్‌కు వస్తున్న సీతక్క ఫ్యామిలి అడ్డగింత

కరోనాతో ఎంతోమంది దిక్కూ, మొక్కూ లేకుండా అల్లాడుతుంటే.. తన వంతు బాధ్యతగా అలాంటి వారందిరినీ ఆదుకుంటూ.. ఊరూరా తిరుగుతున్నారు ఎమ్మెల్యే సీతక్క. చివరికి తన తల్లికి కరోనా సోకినా.. ఇంట్లో అన్నీ సమకూర్చి.. ఊర్ల బాట పట్టారు. అయితే సీతక్క తల్లికి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సీతక్క తల్లికి ప్లాస్మా అవసరమవడంతో ఆమె కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేయడానికి హైదరాబాద్‌కి బయలుదేరారు. అందుకోసం ములుగు కలెక్టరెట్ నుంచి వెహికిల్ పాస్ కూడా తీసుకున్నారు. అయితే సీతక్క కుటుంబసభ్యులు హైదరాబాద్‌కి చేరుకోగానే.. డీసీపీ రక్షితా మూర్తి వారి వాహనాన్ని ఆపారు. పాస్ ఉన్నా కూడా పట్టించుకోకుండా.. లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేశారంటూ.. వాహనాన్ని అర్దగంట పాటు పక్కకు ఆపి ఫైన్ వేశారు. తాము సీతక్క మనుషులమని.. తమకు పాస్ ఉందని చెప్పినా వినిపించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. చివరకు అర్ధగంట తర్వాత డీసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత.. ఆమె కిందిస్థాయి అధికారి పరిస్థితిని అర్థం చేసుకొని.. సీతక్క బంధువుల వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. అయితే వాహన పాస్ ఉన్న ఒక ఎమ్మెల్యే కుటుంబానికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఫైన్లు, చలాన్ల కన్నా మానవత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఆమె పోలీసులకు ట్వీట్ చేశారు.

‘మా అమ్మ ఐసీయూలో సీరియస్‌గా ఉండటంతో.. ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి వెహికల్ పర్మిషన్‌తో వస్తున్న మా కుటుంబ సభ్యులను ఈ విధంగా మల్కాజిగిరి డీసీపీ రక్షిత గారు అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టారు. నేను వీడియో కాల్ చేసినా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పైగా.. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ మా వాళ్లని అన్నారు. ఒక ప్రజా సేవకురాలు, ఎమ్మెల్యే అయినా నాకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి’ అంటూ సీతక్క వాపోయారు.