Telangana Assembly : పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు .. ఇది ప్రజాప్రభుత్వం: వేముల వీరేశం

Telangana Assembly : పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు .. ఇది ప్రజాప్రభుత్వం: వేముల వీరేశం

బీఆర్ఎస్ చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  పదే పదే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడ్తామంటున్నారు..  పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు.. ప్రజాప్రభుత్వం అని అన్నారు.  బీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ బయటపెడ్తానని చెప్పారు.

ప్రజాభవన్ లో కి గతంలో ప్రజలకు అనుమతి లేదని.. సీఎం ప్రమాణం చేసిన రోజే ముళ్ల కంచెలు తొలగించామన్నారు వేముల వీరేశం.  సీఎం రేవంత్ దొరల గడీలను బద్దలు కొట్టారని చెప్పారు.  ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ప్రజల  సమస్యలను  వింటున్నామన్నారు.   బీఆర్ఎస్ లో తనను కనీసం మనిషిగా చూడలేదు..అందుకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వేముల వీరేశం.  గత ప్రభుత్వంలో దళిత డిప్యూటీ సీఎంను ఎందుకు పక్కకు పెట్టారని ప్రశ్నించారు.   దళిత  డిప్యూటీ సీఎంను ప్రజాభవన్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ ది అని చెప్పారు.  బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ లు తొలగించారని విమర్శించారు. 

బీఆర్ఎస్ ప్రజా సంక్షేమానికి కట్టుబడితే ఎందుకు జిల్లాల్లో ఒక్కో  సీటుకు పరిమితం అయ్యిందని ప్రశ్నించారు వేముల వీరేశం.   బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మడం లేదు..  బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు.   దళిత బంధు పేరుతో మిగతా నిధులన్నీ పక్కకె నెట్టారని చెప్పారు. 2018లో ఇస్తానన్న  నిరుద్యోగ భృతి హామీ, దళితులకు మూడెకరాలు భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏమైందని ప్రశ్నించారు.   కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో రెండు గ్యారంటీలను అమలు చేసింది..ఇంకో రెండు హామీలు అమలు చేసేందుకు సిద్ధమయ్యిందన్నారు.  తెలంగాణకు కాంగ్రెస్  శ్రీరామ రక్ష అని చెప్పారు.

మిషన్ భగీరథలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే వేముల వీరేశం.  గ్రామాల్లో ఇంకా తాగునీళ్లు రావడం లేదన్నారు.   దక్షిణ తెలంగాణను ఏడారి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు.. ఉమ్మడి నల్గొండలో  ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. అందుకే నల్గొండ ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారని విమర్శించారు.  బీఆర్ఎస్ అన్ని రంగాలను, సంస్థలను ధ్వంసం చేసిందన్నారు.

ప్రజలను చైతన్యం చేసిన గద్దర్ ను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు వేముల వీరేశం.  గద్దర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా 3 గంటలు ఎండలో నిల్చోబెట్టారని గుర్తు చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించిందన్నారు.