కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఆఫీసులో ఆయనను కలిసి మెమోరాండం అందజేశారు. నిజామాబాద్ – జగ్దల్పూర్ నేషనల్ హైవే 63లో భాగంగా 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణకు పనులు మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న జోడు వాగుల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఫారెస్టు, పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించిందన్నారు.
ఈ పర్మిషన్ల కోసం కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు నిధుల చెల్లింపులో కూడా తీవ్ర జాప్యం చేసిందన్నారు. దీంతో జోడు వాగుల వద్ద బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులు గత కొన్నేండ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఎట్టకేలకు ఇటీవల ఫారెస్టు, పర్యావరణ అనుమతులు లభించడంతో వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం కారణంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే బ్రిడ్జికి ఇరువైపుల ఉన్న హైవే పెండింగ్ పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివేక్, వంశీకృష్ణ తెలిపారు. బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తయితే చెన్నూరు ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరుతాయన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
