తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు : వివేక్ వెంకటస్వామి

తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు : వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, అందుకే  ఆయనను ప్రజలు ఓడించారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అప్పులపై ప్రజలకు తెలిసేలా వైట్ పేపర్​ రిలీజ్​ చేయాల్సిందిగా రేవంత్​రెడ్డిని కోరుతానని చెప్పారు. ‘‘ఆర్థి క శాఖను కేసీఆర్ ఆగం చేసిండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు. ఒక్క కాళేశ్వరం కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిండు. కానీ ఆ ప్రాజెక్టుతో ఇంతవరకు నీళ్లే రాలేదు. కాళేశ్వరం అప్పు తీర్చే వరకు వడ్డీ కిందనే రూ.50 వేల కోట్లు కట్టాల్సి ఉంటుంది. అవన్నీ ప్రజల పైసలే’’ అని అన్నారు. 

"ప్రజల మీదే భారం పడుతుంది. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అప్పుల గురించి ప్రజలకు తెలిసేలా వైట్ పేపర్ విడుదల చేయాలని కోరుతాను” అని వివేక్ వెంకటస్వామికి చెప్పారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని విజయ్ నగర్ కాలనీలో జైభీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వివేక్ హాజరై మాట్లాడారు. మంత్రి పదవి వచ్చినా, రాకపోయినా ప్రజల కోసం సేవ చేస్తానని ఆయన అన్నారు.

కేసీఆర్ అవినీతిపై పోరాడినం.. 

కాళేశ్వరం, మిషన్ భగీరథ స్కామ్స్ తో ఖజానా ఖాళీ అయిందని వివేక్ అన్నారు. ‘‘నాలుగేండ్ల సంది కేసీఆర్ అవినీతిపై పోరాటం చేశాం. అందుకే జనమంతా కేసీఆర్ ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. పోరాటం ఫలించి మంచి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది” అని పేర్కొన్నారు. ‘‘యాంటీ కేసీఆర్ నినాదం తీసుకురాకపోతే, మళ్లీ వాళ్లే అధికారంలోకి వచ్చేవారు. అదే కుటుంబ పాలన, నియంతృత్వ పాలన సాగేది. మా మీడియా ద్వారా ప్రజా సమస్యలపై ప్రశ్నించాం తప్ప.. ఏనాడూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లలేదు” అని పేర్కొన్నారు.  

ఎట్లున్న సమస్యలు అట్లనే ఉన్నయ్.. 

రాష్ట్రంలో పదేండ్ల కింద ఉన్న సమస్యలే, ఇప్పటికీ ఉన్నాయని వివేక్ అన్నారు. ‘‘ఎన్నో ఏండ్లు ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నం. కానీ కొత్త రాష్ట్రంలో కుటుంబ, అహంకార పాలన సాగింది. ఎక్కడ కమీషన్లు వస్తాయో, అక్కడే బిల్లులు రిలీజ్ చేశారు. మంచిగున్న సెక్రటేరియెట్ ను కూల్చి రూ.1,200 కోట్లతో కొత్త సెక్రటేరియెట్ కట్టారు. ఇంటింటికీ తాగు నీరు ఇస్తామని చెప్పి, మిషన్ భగీరథ పేరుతో రూ.80 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ నీళ్లు ఇవ్వనేలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను చెన్నూరు నియోజకవర్గంలో అన్ని ఊర్లలో పర్యటించాను. ఏ గ్రామానికి వెళ్లిన తాగు నీటి సమస్య ఉందని ప్రజలు నా దృష్టికి తెచ్చారు” అని పేర్కొన్నారు.