బ్లాక్‌‌ మెయిల్ తప్ప కేటీఆర్‌‌కు ఏం తెలుసు?: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

బ్లాక్‌‌ మెయిల్ తప్ప కేటీఆర్‌‌కు ఏం తెలుసు?: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  •     లీగల్‌‌ నోటీసులతో బెదిరించాలని చూస్తున్నరు: యెన్నం శ్రీనివాస్‌‌ రెడ్డి
  •     ఆధారాలు ఉండటం వల్లే పోలీస్ అధికారులను జైల్లో పెట్టారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లీగల్ నోటీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తనతో పాటు మరో ఇద్దరికి ఆయన లీగల్ నోటీసులు పంపారన్నారు. గురువారం గాంధీ భవన్‌‌లో మీడియాతో యెన్నం మాట్లాడారు. కేటీఆర్‌‌కు న్యాయవ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్‌‌పైనా ఏమైనా అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. మేనేజ్‌‌మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్‌‌కు ఏం తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్‌‌పై వరుస కథనాలు వస్తున్నాయని, తాము కూడా దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. కేటీఆర్‌‌కు బ్లాక్‌‌ మెయిల్ బెదిరింపులు తప్ప.. ఏం తెలుసని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌‌ కేసు విచారణ జరుగుతున్నప్పుడు లీగల్ నోటీసులు ఇస్తరా? అని నిలదీశారు. 

ఈ కేసులో ఆధారాలు ఉండటం వల్లే పోలీస్ అధికారులను జైల్లో పెట్టారన్నారు. తాను కేటీఆర్ ప్లేస్‌‌లో ఉండుంటే, డీజీపీకి లేఖ రాసి.. ఈ కేసును నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడినన్నారు. ఢిల్లీకి కప్పం కడుతున్నారన్న కేటీఆర్‌‌‌‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి లీగల్ నోటీసులు ఇవ్వాలని కోరారు. గతంలో ఫామ్‌‌హౌస్‌‌లో కేసీఆర్, గెస్ట్ హౌస్‌‌లో కేటీఆర్ ఉండి పాలన సాగించారని విమర్శించారు. బీఆర్ఎస్ హయంలో ఇతర పార్టీల నేతలవే కాకుండా, సొంతింటి వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఇప్పుడు ఈ మాటలు అన్నందుకు కూడా నోటీసులు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాజ వ్యతిరేక శక్తులపై చేస్తారని, కానీ హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు.