ఎమ్మెల్యేలకు ఫండ్స్​ లేవ్.. ఊర్లల్ల పనులైతలేవ్​​

ఎమ్మెల్యేలకు ఫండ్స్​ లేవ్.. ఊర్లల్ల పనులైతలేవ్​​
  • డ్రైనేజీలు, రోడ్ల పనులు కూడా చేపట్టలేక పోతున్నామంటున్న ఎమ్మెల్యేలు
  • సీడీపీ నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కారు
  • కరోనా టైంలో ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు కార్యకర్తలు, జనం నుంచి వినతులు
  • ముఖం చాటేస్తున్న లీడర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా కాలంలో ఎమ్మెల్యేలు నిధుల కోసం తండ్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి  పైసలు రాకపోవడంతో తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేపట్టలేకపోతున్నారు. మూడేండ్లుగా ‘నియోజకవర్గ డెవలప్​మెంట్ ప్రోగ్రాం’ (సీడీపీ) ఫండ్స్​ను  ప్రభుత్వం ఫ్రీజింగ్​లో పెట్టింది. కరోనా టైంలోనైనా వీటిని ఇవ్వకపోవడంతో  నియోజకవర్గంలో పీహెచ్​సీలు, హెల్త్ సెంటర్లలో కనీస సదుపాయాలు, రిపేర్ల వంటి పనులు కూడా చేయించలేకపోతున్నామని, జనంలో మాట చెల్లడం లేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. సాయం అడుగుతున్న పార్టీ కార్యకర్తలకు కూడా ఏమీ ఇవ్వలేకపోతున్నామని, నిధులు లేక గ్రామాల్లో డ్రైనేజీలు, కల్వర్టులు, రోడ్ల పనులూ సాగడం లేదని చెప్తున్నారు. 

సెకండ్ టైం నుంచి ఇదే పరిస్థితి

2018లో రెండోసారి టీఆర్ఎస్  పవర్ లోకి వచ్చినప్పట్నించి బడ్జెట్​లో సీడీపీ కింద నిధులు కేటాయించడం, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం జరుగుతోంది. 2019–-20లో ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ. 3 కోట్లు కేటాయించారు.  కానీ నిధుల కొరత ఉందని సాకు చెప్పి మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఆవేదన వెలిబుచ్చారు. నిధులు రాక నియోజకవర్గాల్లో పనులు చేపట్టలేకపోతున్నామన్నారు. దీంతో  2020–-21 బడ్జెట్​లో నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ హామీచ్చారు. కానీ కరోనా కారణంగా  దాన్నీ ఎత్తేశారు. 2021–-22 బడ్జెట్​లో సీడీపీ కింద  ఒక్కో ఎమ్మెల్యేకు ఏటా రూ. 5 కోట్లు కేటాయించారు. ఈలోపే కరోనా సెకండ్ వేవ్ రావడంతో ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఈ మధ్య సీఎం కేసీఆర్ ఫైనాన్స్ రివ్యూ నిర్వహించి, అనవసర ఖర్చులు తగ్గించాలని స్పష్టం చేయడంతో మళ్లీ సీడీపీ ఫండ్స్​కు  కత్తెర పడబోతున్నదన్న టాక్​ మొదలైంది. 

దాతల చుట్టూ చక్కర్లు 

కరోనా టైమ్​లో సీడీపీ నిధులు రాకపోవటం ఇబ్బందిగా మారిందని  ఎమ్మెల్యేలు అంటున్నారు. సీడీపీ నిధులు విడుదలైతే అందులో కొన్ని నిధులైనా  కేసులు ఎక్కువగా ఉన్న చోట ఐసోలేషన్​ సెంటర్ల ఏర్పాటు, మెడికల్​ కిట్ల కొనుగోలు, అవసరమున్న బాధితులు, పేషెంట్లకు నిత్యావసరాల పంపిణీకి  ఖర్చు చేసే అవకాశముండేదని అభిప్రాయపడుతున్నారు. ఆ నిధులు రాకపోవడంతో చందాలు ఇచ్చే దాతలు, సాయం చేసే వారి కోసం వారు ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, ఎన్ ఆర్ ఐలు, ఎన్జీవోలకు ఫోన్ చేసి ఆర్థిక సాయం చేయండని అడుగుతున్నారు. ‘‘కరోనా టైమ్ లో జనానికి సాయం చేయకపోతే పరువు పోతుంది. మా దగ్గర నిధుల్లేవ్​. మీరన్నా ఆదుకోండి” అని వారిని  కోరుతున్నారు. 

ఎన్నారై  ఫ్రెండ్స్​ ఆదుకున్నరు

కరోనా వల్ల ఆపతిలో ఉన్నామని, ఆదుకోవాలని కార్యకర్తలు వస్తున్నరు. వారికి ఎంతో కొంత ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో సపోర్టు చెయ్యరు. అందుకని ఫారిన్ లో ఉన్న మా ఫ్రెండ్స్ ను అడిగితే కొంత సాయం చేసిన్రు. వాటినే కార్యకర్తలకు ఇచ్చిన. అదే నియోజకవర్గ ఫండ్స్ ఉంటే కార్యకర్తలకు ఊర్లల్లో  పనులు అప్పగించెటోళ్లం. 
- ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఉట్టి చేతులతో వెళ్లలేకపోతున్నం

ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే జీతం రోజు వారీ ఖర్చులకు సరిపోతున్నది. బయటికి వెళ్తే తక్కువలో తక్కువ పదివేలు ఖర్చవుతున్నయ్.  కరోనా టైమ్ లో గ్రామాలకు ఉట్టి చేతులతో వెళ్తే పార్టీ కార్యకర్తలు, జనం అదోలా చూస్తున్నరు. 
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే  

కాలు బయట పెట్టాల్నంటే భయమైతున్నది. ఎవరైనా సాయం చేయాలని అడిగినా, ఊర్లల్ల పనులు చేపట్టాలని అడిగినా మా దగ్గర పైసలు ఉంటలేవు. నియోజకవర్గ ఫండ్స్​ ఉంటే ఆ పనులు చేపిస్తుంటిమి. ఇప్పుడు ఇజ్జత్​ పోయే పరిస్థితి వచ్చింది. కరోనా టైంలో కూడా ఆదుకోకపోతే ఎట్లని కార్యకర్తలు, ప్రజలు ప్రశ్నిస్తున్నరు. 
- ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే