మినీ ఐపీఎల్ నుంచి తప్పుకున్న రాయుడు.. రాజకీయాల కోసమేనా?

మినీ ఐపీఎల్ నుంచి తప్పుకున్న రాయుడు.. రాజకీయాల కోసమేనా?

టీమిండియా మాజీ క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్న మేజర్  లీగ్ క్రికెట్ (మినీ ఐపీఎల్) నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ సీజన్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.

ఈ నెల 13 నుంచి అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా.. నాలుగు జట్లు ఐపీఎల్ ప్రాంచైజీలవే. లాస్ ఏంజెలిస్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్, సియాటెల్ ఓర్కాస్ ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు చెందినవి కాగా, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లను భారత సంతతి వ్యాపారవేత్తలు సొంతం చేసుకున్నారు.

రాజకీయాల కోసమేనా?

మేజర్ లీగ్ టోర్నీ నుంచి రాయుడు తప్పుకోవడం వెనుక రాజకీయాల కారణాలు ఉండొచ్చన్న వందంతులు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఏపీ రాజకీయాల్లో అడుగులు వేస్తున్న రాయుడు.. తన రాజకీయ ప్రవేశానికి ఎక్కువ సమయం లేనందున తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాయుడు.. ఇటీవల తన సొంత జిల్లా గుంటూరులో విస్తృత పర్యటనలు చేస్తూ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అందుకు మరింత సమయం కేటాయించనున్నారట.

రాయుడు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ సీటు లేదా సొంత జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగొచ్చని సమాచారం.