అమీన్పూర్, వెలుగు: పటాన్చెరు నియోజవకర్గంలో 13 డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ కర్ణన్‌ను కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనపై పది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పటాన్చెరు, అమీన్పూర్, బొల్లారం పట్టణ బీజేపీ నాయకులతో కలిసి కమిషనర్‌కు అందజేశారు.
అమీన్‌ఫూర్ మున్సిపాలిటీ పరిధిలో లక్షా ఇరవై వేల మంది ఓటర్లు ఉన్నారని, ఇక్కడ నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం అమీన్పూర్, సుల్తాన్పూర్పేరుతో రెండు మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. అమీన్‌పూర్‌తో పాటు పటేల్‌గూడ లేదా కిష్టారెడ్డిపేటను, బీరంగూడ, పీజేఆర్ కాలనీ పేరుతో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలన్నారు. సుల్తాన్పూర్ స్థానంలో కిష్టారెడ్డిపేట లేదా పటేల్గూడను డివిజన్‌గా ప్రకటించాలన్నారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు డివిజన్లు చేయాలన్నారు. తెల్లాపూర్‌తో పాటు ముత్తంగి పేరిట డివిజన్లు ఏర్పాటు చేశారని, ఇక్కడ లక్షా ఇరవై వేల మంది ఓటర్లు ఉంటారని, కొల్లూరు, ఈదులనాగులపల్లి డబుల్ బెడ్ రూమ్‌లలో సుమారు నలభై వేల మంది ఓటర్లు ఉన్నారన్నారు. తెల్లాపూర్, ముత్తంగితో పాటు కొల్లూరు, వెలిమెల పేరుతో మరో రెండు డివిజన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలో 80వేల పై చిలుకు ఓటర్లు ఉన్నారని, ఇక్కడ మూడు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండగా జేపీ కాలనీ పేరుతో ఒకే డివిజన్‌ను ప్రకటించారన్నారు. ఆల్విన్ కాలనీ పేరుతో మరో డివిజన్‌ను విభజించాలన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఐడీఏ బొల్లారం డివిజన్‌ను అమీన్పూర్, తెల్లాపూర్ డివిజన్లతో పాటే శేరిలింగంపల్లి జోన్లో కలపాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, బొల్లారం పట్టణ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి, అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, నాయకులు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
