కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ తిరస్కరణ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ తిరస్కరణ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్​నగర్ ​టౌన్, వెలుగు: కేంద్ర మం త్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్​ను  గవర్నర్ తమిళిసై తిరస్కరించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను గవర్నర్ తిరస్కరించడం ఎంతవరకు కరెక్ట్ అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

 వీరిద్దరూ ఎలాంటి సామాజిక సేవ చేయలేదని.. కేవలం రాజకీయ నేతలు మాత్రమేనని పేర్కొనడం సరికాదన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలైన తమిళిసై రాజకీయాల నుంచి నేరుగా గవర్నర్ కాలేదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఓ న్యాయం, బీఆర్ఎస్ పార్టీకి మరో న్యాయమా? అని నిలదీశారు. గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని తెలిపారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో 58 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.