ఉద్యోగుల జీతాల్లో కోత‌లు విధించ‌డానికి కార‌ణ‌మిదే: ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి

ఉద్యోగుల జీతాల్లో కోత‌లు విధించ‌డానికి కార‌ణ‌మిదే: ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి

కొండ పోచమ్మ ఎత్తి పోతల పథకం ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్ కొవిడ్ నియమ నిబంధ‌న‌లను పాటించలేదని అన్నారు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. కనీసం భౌతిక దూరం, మాస్క్ ధరించకుండా సుదర్శన యాగంలో పాల్గొన్నారని విమ‌ర్శించారు. శ‌నివారం జ‌గిత్యాల‌లోని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. గచ్చిబౌలి స్టేడియాన్ని సూపర్ స్పెషాలిటీ స్టేడియం గా మార్చి కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తామని పేర్కొన్న సీఎం.. ఆ వైద్య‌శాల‌లో ఒక్క పేషెంట్ ను కూడా చేర్చలేదన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు ఏ విధంగా చేస్తుందో అర్థం అవుతుందని చెప్పారు.

కరోనా వైరస్ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమ‌య్యాయ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 30 వేల పరీక్షలు మాత్రమే చేశారన్నారు. అధికారుల, నాయకుల మాటలు మధ్య కరోనా విషయంలో పొంతన లేదని, దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని జీవ‌న్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో మన దగ్గర కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కరోనా వైరస్ అనుమానితుల అందరికీ ప్రభుత్వ వసతులతో కూడిన క్వారంటైన్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.

మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతోనే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించార‌న్న జీవ‌న్ రెడ్డి.. ప్రభుత్వ పరంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర వర్గాలకు పూర్తి స్థాయిలో నెలసరి వేతనాలు చెల్లించాలన్నారు. బీపీఎల్ కుటుంబాలకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ దైవ ప్రార్థనలకు అనుమతులు ఇవ్వాలని అన్నారు.