కమీషన్ల కోసమే ‘కాళేశ్వరం’: జీవన్​రెడ్డి

కమీషన్ల కోసమే ‘కాళేశ్వరం’: జీవన్​రెడ్డి

నామినేషన్ పై కట్టబెట్టిన పనుల్ని రద్దు చేయాలె  కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.4,600 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో పాత కాంట్రాక్టరుకు కట్టబెట్టారని కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ల జేబులు, వాళ్ల జేబులు నింపుకోవడానికే ఇష్టారాజ్యంగా పనులు కట్టబెట్టారని మండిపడ్డారు. నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనులను రద్దు చేయాలన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్​వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేవలం ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి రూ.4,600 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నీటిని ఎల్లంపల్లికి ఒక్క చుక్క కూడా ఎత్తి పోయలేదన్నారు. ఎల్లంపల్లికి పైనుంచి వచ్చిన నీటినే మిడ్​మానేరు, ఎల్ఎండీకి తరలించారని చెప్పారు. రోజుకు2 టీఎంసీల చొప్పున 50 రోజుల్లో100 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా15 టీఎంసీలను మాత్రమే ఎత్తిపోశారన్నారు. మిడ్​మానేరు, ఎల్ఎండీలో 50 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం20 టీఎంసీల నీరే  ఉందన్నారు.